ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

ఈ క్షణాన్ని జీవించడం ఎలా..??



🌾 ఒక గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతను చాలా అమాయకుడు. అతనికి కొద్దిగా పొలం ఉండేది. పొలం పని చేసుకుంటూ జీవితం వెళ్లదీసేవాడు. పొలం పని చేసేటప్పుడు ఎదురుగా ఉన్న కొండల్ని చూసేవాడు. అవి ఎంతో గంభీరంగా, పచ్చగా కనిపించేవి. అవి అతని పొలానికి దగ్గర్లోనే ఉండేవి.

🌾 ఆ రైతుకు ఆ పర్వతాల పైకి వెళ్లాలని ఎప్పటినుంచో కోరిక. ఇతర్లని వాకబు చేస్తే తెల్లవారుజామునే లాంతరు తీసుకుని బయల్దేరితే సూర్యోదయం అయ్యేలోపున పర్వతం పైకి చేరుకోవచ్చు. అదేమంత కష్టం కాదు.

🌾 మరీ ఉదయం బయల్దేరితే కొండపైకి వెళ్లేసరికి ఎండ బాగా వేడెక్కుతుంది. అప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. ఆరైతు ఒకరోజు పర్వతం ఎక్కాలని నిర్ణయించుకున్నాడు. ఒక లాంతరు సంపాదించాడు.

🌾 పర్వత సౌందర్యాన్ని ఊహించుకుంటూ, ప్రయాణాన్ని తలచుకుంటూ పడుకున్నాడు. ఉన్నట్లుండి మెలకువ వచ్చింది. అప్పటికి రాత్రి ఒంటిగంట అయింది. నిజానికి రాత్రి నాలుగు గంటలకు బయలుదేరితే చాలు. కానీ రైతుకు నిద్ర రాలేదు. ఒంటిగంట అయితే ఏమి? మెల్లగా నడుద్దాం అనుకుని లాంతరు వెలిగించి కొండ దగ్గరకు వెళ్లాడు. అంతలో అతన్ని ఒక సందేహం పట్టుకుంది.

🌾 కొండని చూశాడు. వేల అడుగుల ఎత్తువుంది. గాండాంధకారంలో ఉంది. లాంతరు చూశాడు. దాని కాంతి కేవలం పది అడుగులు మాత్రమే పడుతోంది. తక్కిన స్థలమంతా చీకటిగా ఉంది. దాంతో దిగులుపడిపోయాడు. పది అడుగులు దూరం పడే కాంతితో వేల అడుగుల పర్వతాన్ని ఎలా ఎక్కాలి? అని దిగులు పడిపోయాడు. పర్వతం అంచులో దిగాలుగా కూచుని ఆలోచనలో మునిగిపోయాడు.

🌾 ఇంతలో ఒక వృద్ధుడు ఒక లాంతరు పట్టుకుని పర్వతం ఎక్కుతూ కనిపించాడు. అతన్ని చూసి రైతు ఆశ్చర్యపోయాడు. పరిగెత్తుకుంటూ వృద్ధుని దగ్గరకి వెళ్లి ఇంత చిన్న లాంతరు పట్టుకుని అంత పెద్ద పర్వతాన్ని నువ్వు ఎలా ఎక్కుతావు. ఈ లాంతరు కాంతి పది అడుగుల మేర మాత్రమే పడుతుంది కదా! అని తన సందేహం వ్యక్తపరిచాడు.

🌾 వృద్ధుడు ఆ రైతు అమాయకత్వానికి విస్తుపోయాడు. అతన్ని తేరిపార జూసి నువ్వు అమాయకుడిలా ఉన్నావు. లాంతరు కాంతి పది అడుగులమేర మాత్రమే పడుతుంది. నాకూ తెలుసు.

🌾 పర్వతం గాండాంధకారంలో మునిగి ఉంది. ఆ సంగతి కూడా నాకు తెలుసు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన సంగతి ఒకటుంది. నేను లాంతరు పట్టుకుని నడుస్తున్నాను. నడిచినంతమేరా కాంతి పడుతూనే ఉంటుంది. దారి కనిపిస్తూనే ఉంటుంది. కదలకుండా ఒకచోట ఆగిపోతే అంతా చీకటిగా ఉంటుంది కాంతితో బాటు నడిస్తే కాంతి కూడా మనతో బాటు నడుస్తుంది. దారి మనకు కనిపిస్తుంది అన్నాడు. రైతుకు రహస్యం బోధపడింది.

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి