ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

కార్తీకపౌర్ణమి -త్రిపురిపూర్ణిమ -దేవ దీపావళి



🪔🪔🪔🪔🪔🪔🪔

కార్తీక పౌర్ణమి మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని ”త్రిపురి పూర్ణిమ”, ”దేవ దీపావళి” అని కూడా అంటారు. పరమ శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని కార్తీక పౌర్ణమి నాడు సంహరించి జగతిని కాపాడడం జరిగింది.

మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి.

కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి.
ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.
రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు.
కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు.

కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి.

కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం. గురునానక్ జయంతి కూడా ఈరోజే. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు.

పౌర్ణమినాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దేవుని దర్శించిన అనంతరం, సాయంత్రం శుచిగా ఉసిరికాయపై దీపాలు వెలిగించాలి. బియ్యప్పిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనే కూడా వాడవచ్చు. కార్తీకమాసంలో దీపదానం చేస్తే ఫుణ్యమని అంటారు. కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన జన్మాంతర పాపాలు నశిస్తాయంటారు.
దీపదానం చేయాలనుకునే వారు పత్తితో స్వయంగా వత్తులు చేసుకోవాలి. బియ్యంపిండి లేదా గోదుమపిండితో ప్రమిధలు చేసిన అందులో ఆవునెయ్యితో తాము చేసిన వత్తులు వేసి వెలిగించాలి. బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ నెలలో వచ్చే నాలుగు సోమవారాలలో శివునిని పూజించడంతో పాటు ఉపవాస వ్రతాలు చేస్తే మంచిది.
కార్తీకమాసంలో వెలిగించే దీపాలను దర్శించడం వలన మనుష్యులతో పాటు సమస్త జీవరాసులకు పునర్జన్మ ఉండదని పురాణాల్లో ఉంది.

దేవాలయాలలో చేసిన దీపారాధన వలన పుణ్యలోకాలు లభిస్తాయని నమ్ముతారు.

హర హర మహాదేవ! శంభోశంకర హర!

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి