#ధర్మసందేహాలు – #సమాధానాలు
#ప్ర: ఏ సమయాల్లో నిద్రించాలి? ఏ వేళల్లో నిద్రించకూడదు?
#జ: రాత్రివేళల్లో మాత్రమే నిద్రించాలి. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో నిద్రపోరాదు. అలా నిద్రపోతే పుణ్యాలు క్షయమై పోతాయి. మన పెద్దలు రాత్రిని ఎలా గడపాలో స్పష్టంగా చెప్పారు.
*చతుర్థ ప్రథమౌ యమౌ విద్యాభ్యాసైర్నయేన్నిశి ౹*
*ప్రహరద్వయ శాయీతుబ్రహ్మ భూయాయ కల్పతే ౹౹*
– “రాత్రి మొదటి జామును (ఎనిమిది గంటల వరకు), నాల్గవ జామును, (తెల్లవారు ఝాము 4 గంటల నుండి) విద్యాభ్యాసంతో గడపాలి. మధ్యలో రెండు జాములు నిద్రలోగడపాలి’. ఇది విద్యార్థులకు అలవాటు చేస్తే చక్కని ఆరోగ్యం, మేధస్సు పెరుగుతాయి. అందరూ అవలంబించవలసిన పద్ధతి ఇది. విద్యార్థులు కానివారు – తెల్లవారు జామున ధ్యానాది అనుష్ఠానాలతో గడపాలి. తూర్పు, దక్షిణ, పశ్చిమాలవైపు తల పెట్టుకోవచ్చు. కానీ ఉత్తర శిరస్సుగా ఎప్పుడూ నిద్రించకూడదు. పడుకొనే ముందు *అగస్తిర్మాధవశ్చైవ ముచికుందో మహామునిః ౹ కపిలోముని రాస్తీకః పంచైతే సుఖాశాయినః ౹౹* – అనే శ్లోకాన్ని చదివి, విష్ణువునకు నమస్కరించాలి.
“అగస్త్యుడు, మాధవుడు, ముచికుందుడు, కపిల మహర్షి, ఆస్తీకుడు” – వీళ్ళను సుఖశాయులంటారు. వీరిని స్మరించేవారికి మంచి నిద్రపడుతుంది.
సంధ్యాకాలాలలోనూ, గోశాలలోనూ, ధాన్యంవద్ద, దేవతల వద్ద, పెద్దవారికన్నా ఉన్నత ప్రదేశంలోనూ, ఎంగిలి ఉన్నచోటులోనూ నిద్రపోరాదు. పగటి నిద్ర పనికి రాదని కూడా శాస్త్రం చెప్తోంది.
ఈ విధమైన శాస్త్ర నియమాలను పాటిస్తూ నిద్రను అవలంబిస్తే ఆరోగ్యానికి, ఆధ్యాత్మకతకు శ్రేయస్కరం.
వ్యాఖ్యానించండి