ప్ర : కలకత్తా ప్రాంతాలలో పిల్లలు పుట్టాక ‘షష్ఠీదేవి ‘ పూజ చేస్తుంటారు. ఈ షష్ఠీ దేవి ఎవరు ? ఈ దేవత ప్రసక్తి ఎక్కడ ఉంది? ఈమె తాంత్రికదేవతా? లేక మన పురాణాల్లో ఉందా?
జ : ఆ ప్రాంతాలలో శాక్తేయం బాగా ప్రశస్తి వహించింది కనుక, ‘షష్ఠీదేవి ‘ ఆరాధన కూడా అక్కడ ప్రాచుర్యం పొందింది. షష్ఠీదేవి మన సనాతన మతంలోని దేవత. దేవీభాగవతం, బ్రహ్మవైవర్త పురాణం- మొదలైన గ్రంథాలలో ఈ దేవత ప్రసక్తి ఉంది. ప్రకృతి( పరాశక్తి) యొక్క ‘షష్ఠాంశ ‘(ఆరవ కళ )ఈ దేవత. అందుకే ‘షష్ఠీదేవి’ అన్నారు. ఈమె పేరు ‘దేవసేన’ కుమారస్వామి యొక్క శక్తి.
ఈమె సంతానప్రదాయని. అంతేకాక శిశురక్షకి. బాలారిష్టాలనుండి శిశువుల్ని కాపాడే శక్తి. ఈ కారణం చేతనే పిల్లలు పుట్టాక ఈ తల్లిని పూజిస్తారు. బారసాలల్లో మనం పూజించే దేవత కూడా ఈ దేవతే. స్వాయంభువ మనువు కుమారుడు ప్రియవ్రత్రుడు. అతడి సంతానం ఏదీ నిలువకపోయేటప్పటికి దుఃఖాక్రాంతుడౌతాడు. అప్పుడు జగదంబ యొక్క షష్ఠాంశ ‘షష్ఠీదేవత’గా వచ్చి,ఈ రాజుని ఓదార్చి మృతుడైన అతడి శిశువును బ్రతికించినట్లు ‘దేవీభాగవతం ‘ చెప్తోంది. అప్పటినుండి షష్ఠీదేవిని పూజించే ఆచారం వ్యాప్తిలో ఉంది.
శిశువు పుట్టిన ఆరవనాడు, పురిటిశుద్ధినాడు , అన్నప్రాశన సమయంలో ఈ పూజ చేయడం తల్లికీ, బిడ్డకీ క్షేమకరమని పురాణవచనం. మన ధర్మ శాస్త్రాల్లో కూడా షష్ఠీదేవి పూజ ‘విధి’గా చెప్పారు. శిశువు ఎంతకీ ఏడుపు ఆపనప్పుడు షష్ఠీదేవి స్తోత్రం చదివితే వారి బాధ పోతుందని, బాలగ్రహ పీడలు పోతాయని పురాణ వచనం. అమ్మవారివి అనంతరూపాలు. కొన్ని ప్రాంతాల వారు కొన్నిటిని మరిచిపోయి వదులుకున్నారు. కొన్ని ప్రాంతాల వారు మరువకుండా పాటిస్తున్నారు.
వ్యాఖ్యానించండి