🍁🌿🍁🌿🍁🌿🍁🌿
#ప్ర: తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు నారాయణుడని కొందరు, ఈశ్వరుడని కొందరు, సుబ్రహ్మణ్యుడని కొందరు, శక్తి అని కొందరు అంటుంటారు. ఇంతకీ ఏది అసలు ప్రమాణం?
#జ: అసలు ఇలాంటి వాద వివాదాలు అనవసరం. హిందూమతం సర్వదేవతా సమన్వయ మతం. సర్వదేవతామయుడైన పరబ్రహ్మ వేంకటేశ్వరుడు. రామభక్తులు శ్రీరాముడనీ, కృష్ణ భక్తులు శ్రీకృష్ణుడనీ ఒకే విష్ణువును ఆరాధించినట్లే – ఒకే బ్రహ్మమును శివకేశవాది నామ రూపాలలో వారి వారి అభీష్టానుగుణంగా కొలుచు కుంటారు. అయితే, పురాణ ప్రమాణాల ప్రకారం- శ్రీమన్నారాయణుడు అనాదిగా విహరించే శేషాద్రి వేంకటాచలం. మొదట ఆదివరాహ రూపంతో అక్కడ విహరించిన శ్రీహరి, కలియుగారంభంలో వేంకటేశ్వర స్వరూపంలో ఆవిర్భవించాడు.
ఈశ్వర శబ్దం శివునకూ, శ్రీహరికీ కూడా వర్తిస్తుంది. పరమాత్మ సృష్టి స్థితిలయలు చేసేటప్పుడు ఈశ్వరుడు. ఈ మూడు పనులు చేసేది ఒక్కడే. మూడు పనులకు ధరించిన మూడు రూపాలు (బ్రహ్మ, విష్ణు, రుద్రులు) ఒకే ఈశ్వరునివి. ఆ రూపాలను ధరించినది లోక కల్యాణం కోసం. కల్యాణం, మంగళం, క్షేమం, మోక్షం అనే అర్థాలను తెలియజేసే శబ్దం- ‘శివ’.
‘వేంకటేశ్వరుడు నారాయణుని స్వరూపం విష్ణు తేజం’ అని అన్ని పురాణాలు చెబుతున్నాయి. శివునకు లింగరూపం ఆరాధన ప్రసిద్ధి. ఇక సుబ్రహ్మణ్యుడు, శక్తి… అని అన్నా అభ్యంతరం లేదు. ఎవరి అభీష్టదైవాన్ని వారు ఆ నారాయణుని లో దర్శించవచ్చు. “హరి అవతారములే అఖిల దేవతలు” “ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన” వంటి కీర్తనలలో అన్నమయ్య బోధించినదిదే.
శ్రీ వేంకటేశ్వరుని రూపంలో శివ, శక్తి, సుబ్రహ్మణ్య, విష్ణు, అగ్ని దేవతా చిహ్నాలను దర్శించారు. వారి వారి భావాలకనుగుణంగా వ్యాఖ్యానించుకున్నారు. స్వామి అందరినీ అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఈ వాదవివాదాలతో మన సనాతన వైదిక సమన్వయ శక్తిని కోల్పోరాదు. వేద వేద్యమైన పరబ్రహ్మయే నారాయణుడు.
*’స్కంద విష్ణ్వాత్మికా శక్తిః వేంకటేశ ఇతీరితః’* అని స్కాంద పురాణ వచనం.
స్కంద, విష్ణుమయమైన శక్తి విశేషం వేంకట నారాయణునిలో ఉంది. విష్ణు, వైష్ణవీ తత్త్వాలకు భేదం లేదు. ఈ కారణాల చేత దేవతా భేదాల గొడవల జోలికి పోరాదు. శివుడైనా, కేశవుడైనా, శక్తియైనా మన వైదిక దేవతలే. ‘సబ్రహ్మ స్సశివః సహరిః సేంద్రః’- అన్న వైదిక హృదయానికి సాక్షాత్కారం వేంకటేశ్వర స్వరూపం ‘నమశ్శ్రీవేంకటేశాయ’.
—బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనాల నుండి..
🌿🍁🌿🍁🌿🍁🌿🍁
వ్యాఖ్యానించండి