ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

షోడశోపచారములు ప్రాముఖ్యత

ప్రధానంగా 64 ఉపచారాలు చేయాలి. ప్రతిరోజూ కష్టం అంటే షోడశోపచారములు చేయాలి. ఈ పదహారు ఉపచారాలు ఎలా ఉంటాయి అంటే మీకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి మీ ఇంటికి వస్తున్నారనుకోండి. మీ ఉత్సాహం ఎలా ఉంటుందో పూజ అలా ఉండాలి. అది యాంత్రికంగా చేసేది కాదు. ఉమా మహేశ్వరులను రోజూ పూజ చేస్తారనుకోండి. ఆవాహయామి – అక్కడే ఉందిగా విగ్రహం. క్రొత్తగా రమ్మనడమేమిటి? కాదు. స్వామీ! రండి కూర్చొండి. మీ మంటపంలోకి ఆయన ఎక్కుతున్నారు అన్న భావన. ఆసనం సమర్పయామి – సింహాసనంలో కూర్చోండి. ఈ ఉపచారాలు చేస్తున్నప్పుడు మీరు విగ్రహానికి కాదు చేస్తున్నది మనస్సులో ఎదురుగా పరమేశ్వరునికే ఇస్తున్నానన్న భావన చేత పారవశ్యాన్ని పొందారు. అంతసంతోషాన్ని పొంది చిట్టచివర నీరాజనం ఇచ్చి మంత్రపుష్పం చెప్పి పీటమీదనుంచి లేచి బయటికి వచ్చారు. మనిషి పుట్టుకనుంచి శరీరం విడిచి పెట్టడం వరకు పదహారు సంస్కారాలు. చంద్రుడికి పదహారు కళలు. పూజలో పదహారు ఉపచారాలు. పదహారు చేయడానికి సమయం లేకపోతే కనీసంలో కనీసం అయిదు చేయాలి. గంధపుష్పధూపదీపనైవేద్యాలు. “పంచసంఖ్యోపచారిణీ”. అనంతకోటి సుఖాలు మనం అనుభవిస్తున్నాము అంటే అయిదు ఇంద్రియాలలోనుంచే. ఈ అయిదు ఇంద్రియాలు పరమేశ్వరుడిచ్చాడు. విచ్చలవిడిగా వాడుకున్నావు. నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చాడు. నిద్రలో మళ్ళీ ఈ ఇంద్రియాలకీ శక్తినిచ్చాడు. నిద్రలేవగానే నువ్వు సుఖాలన్నీ అనుభవించే ముందు ఎవరికి కృతజ్ఞత చెప్పాలి? ఇచ్చినందుకు ఈశ్వరుడికి చెప్పాలి. అందుకే పూజ ప్రాతఃకాలంలో. దీపంతో పూజ ప్రారంభం. ధూపం వేసి కృతజ్ఞత చెప్తున్నావు. సాత్త్విక భావనతో ఉన్నావు కాబట్టి సాత్త్విక పదార్థాలని ఈశ్వరుడికి నైవేద్యం చేస్తున్నావు. స్పర్శను ఇచ్చినందుకు కృతజ్ఞతగా చల్లటి చందనాన్ని అనులేపనం చేస్తున్నాను. చెవులతో ఎన్నో విని మురిసిపోతున్నావు. వీటికి కృతజ్ఞత చెప్తూ పువ్వులతో ఉపచారం చేస్తున్నావు. అన్నింటికన్నా పెద్ద గౌరవం ప్రసాదానికి ఇస్తారు. ప్రసాదం ఇచ్చినప్పుడు వెంటనే కళ్ళద్దుకొని నోట్లో వేసుకోవాలి. పువ్వులకొరకే తుమ్మెదలు ధ్వని చేస్తాయి. పువ్వు కనపడితే ధ్వని ఆపి మకరందం త్రాగుతుంది. ఆ నామములు చెప్పడం చేత మనస్సు వికసనాన్ని పొందాలి. అందుకే వినేటటువంటి చెవులు ఇచ్చిన ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడానికి నామంతో పువ్వులు వేస్తారు. అనంతమైన సుఖాలు అనుభవించడాని ఈ అయిదు ఇంద్రియాలే కారణం. ఈ అయిదు ఇంద్రియాలు నాకిచ్చి అవి బడలిపోతే మళ్లీ శక్తినిచ్చినందుకు ఈశ్వరా! ముందు నీకు కృతజ్ఞత చెప్పి వాడుకుంటాను ప్రసాదంలాగా. ప్రొద్దున పూజ చేసి ఇంద్రియాలను వాడుకోవడం మొదలుపెడతాడు. అంటే ఈ శరీరాన్ని ప్రసాదంగా వాడుకుంటున్నావు. ఎవడు పూజ చేస్తాడో వాడు పూజనీయుడౌతాడు. ఎవడు పూజ చేయడో వాడు పూజకి అర్హుడు కాకుండా పోతాడు. మీరు భగవంతుడికి కృతజ్ఞతావిష్కారం చేస్తే మీరు పూజ చేసినట్లే మీరుకూడా పూజనీయులౌతారు. లోకంచేత గౌరవింపబడే శీలవంతులౌతారు. భగవంతుడిచ్చినవి కృతజ్ఞత చెప్పకుండా వాడుకుంటే కృతఘ్నతా దోషం వస్తుంది. అందుకని పూజలో అయిదు ఉపచారాలు. ఆయనకి లేక కాదు. మనయొక్క మర్యాద చూపించుకోవడానికి ఈశ్వరుడికి ఈ పంచోపచారాలు చేస్తాం.

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి