రోజూ మూడు పూటలా సంధ్యా వందనం చేయటం చాదస్తం కాదా? అసలిదంతా ఎందుకు? అని ఒకరు అడిగిన ప్రశ్నకు పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద ఈ విధంగా సమాధానం చెప్పారు.
రోజుకి గల 24 గంటలను మూడు భాగాలు చేసి, ఒక భాగాన్ని వృత్తి వ్యాపారాల ద్వారా సంపాదనకు, ఇంకొక భాగాన్ని కాలకృత్యాలు, వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలకూ, మూడవ భాగాన్ని విశ్రాంతికి కేటాయించారు. దీనిలో విశ్రాంతికి కేటాయించిన 8 గంటలలో (రోజుకి) ఆరు గంటల నిద్ర ఆరోగ్యాన్నిస్తుంది. ఆ తదుపరి మిగతా 2 గంటల సమయాన్ని 40 నిముషాల చొప్పున 3 భాగాలు చేసి, మానసికంగా ఊరట పొంది, శక్తిని పెంపొందించుకోవడానికి మన రుషులు శాస్త్రీయమైన విధానాన్ని అవలంబించారు.
ప్రాతః కాలంలో 6 గంటల వేళ 40 నిముషాలు, మధ్యాహ్నం 12 గంటల వేళ మరో 40 నిముషాలు, సాయంత్రం 6 గంటలకు మిగతా 40 నిముషాలు వినియోగించేలా విభజించడం మన రుషుల ప్రతిభకు అద్దం పడుతుంది.
యంత్రానికి కూడా విశ్రాంతి, అప్పుడప్పుడు ఓవరాలింగ్ అవసరమనే సంగతి అందరికీ తెలిసినదే. మనిషి యంత్రం కన్నా ఎన్నో రెట్లు విలువైనవాడు. సున్నితమైన వాడు కూడా. అలాంటి మానవుడికి స్నానం, జపం, సంధ్యావందనం వంటి ఆధ్యాత్మిక వ్యాపకాలు ఎంతటి ప్రశాంతిని తెచ్చిపెడతాయో అనుష్ఠానం ద్వారా అనుభవంలో రుచి చూడవచ్చు.
నిద్ర నుండి మేల్కొన్న వ్యక్తికి బద్ధకముంటుంది. దానిని ఛేదించి, కార్యోన్ముఖుడిని చేసి, మనసుని, బుద్ధిని సంసిద్ధం చేస్తుంది. ప్రాతస్సంధ్యావందనం, మరలా మధ్యాహ్నం వరకు కార్యభారంతో అలసిన వ్యక్తి మాధ్యాహ్నిక సంధ్యావందనంతో మానసికంగా, బౌద్ధికంగా శక్తిని పుంజుకుంటాడు. ఇది సాయంకాలం వరకు దోహదపడుతుంది. ఆ తదుపరి సాయం సంధ్యావందనం ఆ రోజు పడ్డ శ్రమనంతా తొలగించి, కుటుంబంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపే శక్తిని, యుక్తిని అనుగ్రహిస్తుంది.
దీనినే మన భారతదేశంలో అందుబాటులోకి తెచ్చారు లోకకళ్యాణ కాంక్ష కలిగిన మన రుషులు. ఇలా ఆచారాల ద్వారా శాస్త్రీయతను ఆచరణలోకి తేవడమే మన భారతీయత.
వ్యాఖ్యానించండి