ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

ప్రతీ స్త్రీ తప్పకుండా తెలుసుకోవలసిన విషయం

నేటి సమాజంలో కొందరు స్త్రీలు తాము కోరినవి భర్త తేలేని స్థితిలో ఉన్నప్పుడు, అందరి ముందూ తులనాడుతూ, అవహేళన చేస్తూ, అవమానకరంగా ప్రవర్తిస్తుంటారు. భర్తపై హాస్య ధోరణిలో మాట్లాడుతూ అపహాస్యం చేస్తుంటారు. పెళ్ళైన స్త్రీమూర్తి భర్తతో ఎలా ప్రవర్తించాలో చాటి చెప్పే గొప్ప శ్లోకం రామాయణంలో ఉన్నది. పతివ్రతా ధర్మాన్ని ఆచరించి చూపిన మహా పతివ్రత సీతమ్మ తల్లి రావణునిచే అపరింప బడి అశోకవనంలో ఉన్నప్పుడు రాక్షస స్త్రీలతో జరిగిన సంభాషణ, అత్యంత రమణీయం.
వాల్మీకి మహర్షి విరచిత రామాయణం లో సుందర కాండము అత్యంత ప్రశస్తమూ రసబంధురం.అందులో ఈ శ్లోకం అత్యద్భుతంగా ఉంటుంది.ఆదికవి వాల్మీకి అని ఎందుకు అంటారో రామాయణం అంత అద్భుతంగా తాను తన దివ్య దృష్టితో కన్నదంతా పొల్లు పోకుండా విడమరచి వ్రాయడం సామాన్యులకు సాధ్యమేనా.
లంకా రాజ్యములో రావణుని అశోక వనములో శింశుపా వృక్షము కింద సీతకు కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలు ఆమెను పలు పలు విధాలా దూషించారు.
రావణుని వరించి సుఖించమని లేకున్న చంపి తినివేస్తామని బెదిరించారు.
రావణుడు కూడా ఎన్నో ఆశలు చూపెట్టాడు. అయినా మహాపతివ్రత సీతా సాధ్వి కొంచెం కూడా చలించలేదు. ఆమె సుగుణాలు గన్న రాక్షస స్త్రీ గణం మారారు గానీ సీత ఆ లంకా సామ్రాజ్య వైభవం అంతా గడ్డిపోచతో సమానంగా భావించింది.
సీత సుగుణాలకు ముచ్చట పడిన రాక్షస కాంతలు – రాజ్యము వైభవం ఏ మాత్రం లేని రామునే భర్తగా ఇప్పటికీ కోరుకుంటున్నావు. ఆయన్ని తిరిగి చేరినా నీకు కష్టాలు తప్ప మరేముంటుంది అని అడిగారు.దానికి సీతా మహా సాధ్వి ఇచ్చిన సమాధానం ఈ అద్భుత శ్లోకం.

దీనోవా రాజ్య హీనోవా యో మే భర్తా సమే గురు:
తం నిత్యా మనురక్తా స్మి యథా సూర్యం సువర్చలా
యథా శచీ మహా భాగా శక్రం సముపతిష్టతి
అరుంధతీ వశిష్టంచ రోహిణీ శశినం యథా
లోపాముద్ర యగస్త్యం సుకన్యా చ్యవనం యథా
సావిత్రీ సత్యవంతంచ కపిలం శ్రీమతీ యథా
సౌదాసం మదయంతీవ కేశినీ సగరం యథా
నైషధం దమయంతీవ భైమీ పతిమనువ్రతా
తథాహు మిక్ష్వాకువరం రామం పతిమనువ్రతా

తన పతి అయిన రామునికి రాజ్యము లేకపోయినా అతను దీనస్థితిలో ఉన్నా..ఆయన యొడల నిత్యం అనురక్తితో సూర్య భగవానుని సువర్చలా దేవి , ఇంద్రుని మహాపతివ్రత శచీదేవి, క్షత్రియ వంశ గురువు వశిష్టులవారిని అరుంధతి, చంద్రుని వరించి ఆతన్నితోనే అనురక్తురాలైన రోహిణీ తార వలే , అగస్త్య మహామునిని సేవించిన లోపాముద్ర మాదిరి, చ్యవనుని సేవించిన సుకన్యవోలె, సత్యవంతుని బ్రతికించుకున్న సావిత్రి వలే, కపిలమహామునిని సేవించిన శ్రీమతి వలే, సౌదాసుని అనుసరించిన మదయంతి వోలె , సగర చక్రవర్తి ని అనుసరించిన కేశిని వలే, నలమహారాజుని వరించిన భీమ రాజ పుత్రి దమయంతీ దేవి వలే ఇక్ష్వాకు వంశ తిలకుడు తన పతి శ్రీరాముని అన్ని వేళలా అనుసరిస్తానని ఆమె చెప్పడముతో సీత శీల సౌభాగ్యానికి అమిత ముగ్ధులై ఆమె పాదాలను అప్రయత్నంగా తాకారట ఆ రాక్షస స్త్రీలు.ఇదీ మన దేశ స్త్రీల ఔన్నత్యం.ఇదీ మన భారత దేశ సౌభాగ్యము.

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి