ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

కాలభైరవుడు ఎవరు?శివాలయం బయట ఎందుకు ఉంటాడు?

🙏🌺కాలభైరవుడు ఎవరు?
శివాలయం బయట ఎందుకు ఉంటాడు?🌺🙏

🌺ఉజ్జయినిలో వెలసిన కాలభైరవుడు కూడా మహాశక్తిమంతుడని భక్తుల విశ్వాసం. దిల్లీ నగరంలోనూ కాలభైరవ క్షేత్రం ఒకటుంది. అసితాంగ భైరవుడూ, రురు భైరవుడూ, చండ భైరవుడూ, క్రోధ భైరవుడూ, ఉన్మత్త భైరవుడూ, కపాల భైరవుడూ, భీషణ భైరవుడూ, సంహార భైరవుడూ… ఇలా ఎన్నో రూపాల్ని ధరించాడు కాలభైరవుడు. ఒక్కో రూపాన్ని ఉపాసిస్తే, మనలోని ఒక్కో దుర్గుణం తొలగిపోతుందని సాధకులు చెబుతారు.🌺

🌺కాలభైరవుడిని పరమేశ్వరుడి పరిపూర్ణ అవతారంగా భావిస్తారు. బ్రహ్మవిష్ణువులను ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించడానికి రుద్రుడి భృకుటిలోంచి పుట్టిన ఆ మహాశక్తిమంతుడు… దుష్టశిక్షకుడిగా, గ్రహపీడల్ని తొలగించే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. వారణాసికి కాలభైరవుడే క్షేత్రపాలకుడు.🌺

🌺భైరవః పూర్ణ రూపోహి శంకరస్యపరాత్మనః
మూఢాస్తంవై నజానంతి మోహితాశ్శివమాయయా
అని అంటుంది శతరుద్రసంహితం.
శివపురాణమూ, కాశీఖండమూ కాలభైరవుడి గొప్పదనాన్ని కొనియాడాయి. భైరవుడిని స్మరించుకోవడానికైనా ఓ యోగం ఉండాలంటారు. పక్కనే కాలభైరవక్షేత్రం ఉన్నా చాలా సందర్భాల్లో మనం పట్టించుకోం. లోపలికెళ్లాలన్న ఆలోచనా రాదు. అందుకో కారణం ఉందంటారు ఆధ్యాత్మికవేత్తలు. పరమశివుడు మనల్ని ఓరకమైన మాయాలో పడేస్తాడట. దీంతో… కాలభైరవుడి మహత్తును అర్థం చేసుకోలేకపోతామట. ఆ మాయాపొర తొలగిననాడు… పరమేశ్వరుడి పూర్ణాంశ అయిన కాలభైరవుడు కట్టెదుట దర్శనమిస్తాడు. కాలభైరవ ఉపాసన ప్రాచీనమైంది. భైరవుడిని పూజిస్తే గ్రహ దోషాలూ, అపమృత్యు గండాలూ తొలగిపోతాయనీ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ మంత్రశాస్త్రం చెబుతోంది. కాశీ మహానగరం, ఉజ్జయిని తదితర ప్రాచీన క్షేత్రాల్లో కాలభైరవుడి ఆలయాలున్నాయి.🌺

🌺ఎవరీ కాలభైరవుడు??
శివపురాణంలో కాలభైరవ వృత్తాంతం ఉంది. ఓసారి మహర్షులకు ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలన్న జిజ్ఞాస కలిగింది. ఎవరు చెబుతారా అని ఆలోచించారు. సృష్టికర్త కు మించిన బ్రహ్మజ్ఞాని ఎవరుంటారు? నేరుగా బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న మేరు పర్వతానికి వెళ్లారు. బ్రహ్మదేవుడు కూడా ఆ నిగూఢ రహస్యాన్ని తప్పక బోధిస్తానని మాటిచ్చాడు. అంతలోనే…సృష్టికర్త చుట్టూ ఓ మాయాపొరను సృష్టించాడు పరమేశ్వరుడు. దీంతో, మనసులో ఏ మూలనో ఉన్న అహంకారం బయటికొచ్చింది. ‘మహర్షులారా! పరమతత్వం గురించి చెప్పేదేముంది?
నేనే ఆ మహాతత్వాన్ని!
స్వయంభువును నేను!
విధాతను నేను! సృష్టిస్థితిలయ కారకుడినీ నేను!
మీ ప్రశ్నకు జవాబు కూడా నేనే..’ అంటూ ప్రగల్బాలు పలికాడు. అక్కడే ఉన్న విష్ణుమూర్తికి ఆ మాటలు వినిపించాయి. మాయకే మాయలు నేర్పగలిగిన విష్ణుమూర్తిని కూడా మాయాపొర కమ్మేసింది. ‘కాదుకాదు…నేనే గొప్ప’ అంటూ వాదానికి దిగాడు. ఇద్దరూ కలసి వేదాల దగ్గరికెళ్లారు. వేదాలు పురుషరూపాన్ని ధరించి ‘యదంతస్థ్సాని భూతాని యత్సర్వం ప్రవర్తరే…’ – సకల ప్రాణుల్నీ తనలో లీనం చేసుకున్నవాడైన రుద్రుడే పరమతత్వం అంటూ ఆ వేదపురుషుడు పరమేశ్వరుడిని కొనియాడాడు. ఓంకారం కూడా శివుడే సర్వేశ్వరుడని నిర్ధారించింది. అంతలోనే…దివ్యతేజస్సుతో ముక్కంటి ప్రత్యక్షం అయ్యాడు.🌺

🌺ఆ ఆకారాన్ని చూసి బ్రహ్మ ఐదో తల ఫక్కున నవ్వింది. దీంతో శివుడు ఆగ్రహంతో భృకుటి ముడిపడింది. అందులోంచి భయంకరమైన ఆకారంతో ఓ కాలపురుషుడు ఆవిర్భవించాడు. ఆయనే కాలభైరవుడు. భయంకరంగా ఉంటాడు కాబట్టి భైరవుడన్న పేరొచ్చింది. పాపాల్ని పరిహరించేవాడిగా ‘పాపభక్షు’ అయ్యాడు. కాలభైరవుడికి కాశీనగరం మీద ఆధిపత్యాన్ని ప్రసాదించాడు మహాదేవుడు. 🌺

🌺అంతలోనే విష్ణువు చుట్టూ తిరుగుతున్న మాయ కూడా తొలగింది. శివతత్వాన్ని నోరారా మెచ్చుకున్నాడు. దీంతో, నాగభూషణుడు శాంతించి విష్ణుమూర్తిని ఆలింగనం చేసుకున్నాడు. చేతికి అంటుకున్న బ్రహ్మకపాలాన్ని మాత్రం కాలభైరవుడు వదిలించుకోలేకపోయాడు. ముల్లోకాలూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కాశీనగరంలో కాలుపెట్టగానే, మహాద్భుతం జరిగినట్టు…కపాలం వూడిపడింది. దీంతో కాలభైరవుడు ఆనంద తాండవం చేశాడు. కాశీక్షేత్రంలోని ఆ ప్రాంతమే ‘కపాలమోచన’ దివ్యతీర్థంగా ప్రసిద్ధమైంది. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. ఈ తీర్థానికి ఎదురుగా కాలభైరవుడు కొలువుదీరాడు. స్థానికులు ‘లాట్‌_భైరవ’ అని పిలుచుకుంటారు. ఈ క్షేత్రంలో మహాభైరవాష్టమిని ఘనంగా జరుపుతారు. కార్తికమాసంలోని కృష్ణపక్ష అష్టమినే…కాలాష్టమిగా, కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు. మార్గశిర కృష్ణపక్ష అష్టమిని మహాభైరవాష్టమిగా నిర్వహించుకునే వారూ ఉన్నారు. ఆ రోజు కాలభైరవుడి సన్నిధిలో జాగరణ చేస్తారు.🌺

🌺పరమశివుడి ఆదేశం ప్రకారం…కాలభైరవుడే కాశీ క్షేత్రాధిపతి. ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా క్షేత్ర పాలకుడిని సందర్శించుకోవడం ఆచారం. ఇక్కడ అష్టభైరవుల ఆలయాలున్నాయి. విశ్వనాథుడి ఆలయానికి కొద్దిదూరంలో కాలభైరవమూర్తి దర్శనమిస్తాడు. రకరకాల భయాలతో బాధపడేవారు ఇక్కడ రక్షరేకులు కట్టించుకుంటారు. దేవుడికి నైవేద్యంగా_మద్యాన్ని సమర్పిచడం ఈ క్షేత్ర ప్రత్యేకత.మణికర్ణికాఘాట్‌ ప్రాంతంలో కాలభైరవుడిని మశాన్‌_బాబాగా
(శ్మశాన) కొలుస్తారు.🌺

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి