ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

మేడారం మ‌హ‌త్యంసమ్మక్కసారలమ్మ చరిత్ర

🙏🌺మేడారం మ‌హ‌త్యంసమ్మక్కసారలమ్మ చరిత్ర 🌺🙏

🌺రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే వనదేవతలు సమ్మక్క- సారలమ్మ మహత్యం అంతా ఇంతా కాదు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్నారు ఈ గిరిజన వీరవనితలు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో జరిగే ఈ సమ్మక్క- సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందింది. 🌺

🌺తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత 2014లో సమ్మక్క- సారలమ్మ జాతరకు రాష్ట్ర పండుగగా గుర్తింపు వచ్చింది. నిజానికి భారతదేశంలో భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అత్యంత పెద్ద పండుగ కుంభమేళా తర్వాత సమ్మక్క- సారలమ్మ జాతరే పెద్దది. సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, మమారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కోటి లేదా అంతకన్నా ఎక్కువ మందికి పైగా భక్తులు హాజరవుతారనే అంచనా ఉంది.

మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య చారిత్రక సమ్మక్క- సారలమ్మ జాతర జరుగుతుంది. గిరిజనులందరికి సమ్మక్క- సారలమ్మ ఆరాధ్య దేవతలు. దేశంలో అతి పెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన ఈ గిరిజన జాతర గిరిజన సాంప్రదాయంలో జరుగుంది. ఇంత భారీ ఎత్తున పూజలందుకుంటున్న సమ్మక్క- సారలమ్మ.🌺

🌺చరిత్ర🌺

🌺జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలంలోని పొలవాసను అనే ప్రాతానికి గిరిజన దొర అయిన మేడరాజు పాలించేవాడు. ఆయన వేటకు వెళ్లినప్పుడు ఓ పుట్ట మీద కేరింతలు కొడుతూ ఓ పాప కనిపించింది. ఆమెను తెచ్చుకుని సమ్మక్క అని పేరుపెట్టి మేడరాజు పెంచుకున్నాడు.

మేడరాజుకు పుట్ట మీద సమ్మక్క కనిపించినప్పుడు పులులు, సింహాలు ఆమె చుట్టూ రక్షణగా ఉన్నాయట. అందుకే సమ్మక్కను దైవాంశ సంభూతురాలిగా భావించారు. సమ్మక్క హస్తవాసి మంచిది. ఆమె చేత్తో ఆకు పసరు ఇస్తే ఎలాంటి రోగమైనా నయమైపోయేది.

ఇలా మేడరాజు వద్ద పెరుగుతున్న సమ్మక్కను మేడరాజు మేనల్లుడు, మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు పెళ్లిచేశారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న సంతానం.🌺

🌺కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు రాజ్య విస్తరణ కాంక్షతో పొలవాసపై దండెత్తాడు. మొదటి ప్రతాపరుద్రుడి దాడిని తట్టుకోలేని మేడరాజు మేడారం పారిపోయి వచ్చాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉన్నాడు. కరువు కాటకాల వల్ల కాకతీయ ప్రభువులకు కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడమే కాకుండా కోయ గిరిజనులలో సార్వభౌముడికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్నిధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ప్రతాపరుద్రుడు దండెత్తాడు. 🌺

🌺దండెత్తి వచ్చిన ప్రతాపరుద్రుడిపై గిరిజన సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, నాగమ్మ, జంపన్న, గోవిందరాజు వేర్వేరు ప్రాంతాల నుంచి వీరోచితంగా గెరిల్లా యుద్ధం చేశారు. అయితే.. సుశిక్షితులైన కాకతీయ సేనల ధాటికి నిలబడలేక యుద్ధంలోనే మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు మరణించారు. పరాజయం వార్త విన్న జంపన్న అవమాన భారంతో సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచీ సంపెంగవాగు జంపన్న వాగు పేరు పొందింది. యుద్ధభూమిలో సమ్మక్క కాకతీయ సేనలను ముప్పు తిప్పలు పెట్టింది. వీరోచితంగా పోరాడింది. నిజానికి ఈ గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడే ఆశ్చపోయాడని చెబుతారు. చివరికి శత్రువల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి తప్పుకుని చిలకలగుట్ట వైపు వెళ్తూ అదృశ్యమైంది. సమ్మక్కను వెదుకుతూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. అయితే.. వారికి చిలకలగుట్టపై ఒక పుట్ట వద్ద పసుపు, కుంకుమలు ఉన్న భరిణె దొరికింది. ఆ భరిణనే సమ్మక్కగా భావించి అప్పటి నుండీ ప్రతి రెండేళ్లకు ఒక సారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను భక్తి శ్రద్ధలతో గిరిజనులు నిర్వహిస్తున్నారు. 🌺

🌺అతిపెద్ద గిరిజన వనదేవతల జాతరలో తొలిరోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండో రోజున చిలకలగుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మూడో రోజున అమ్మలిద్దరూ గద్దెలపై కొలువుదీరతారు. నాలుగో రోజు సాయంత్రం ఆవాహన పలికి సమ్మక్క- సారలమ్మలను తిరిగి యుద్ధ స్థానానికి తరలిస్తారు.

ఈ వనదేవతలు వంశపారంపర్యంగా గిరిజనులే పూజారులుగా వ్యవహరిస్తున్నారు. కోర్కెలు తీర్చమని అమ్మవార్లకు భక్తులు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పిస్తారు. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరుగుతున్నవిశిష్టమైన ఈ సమ్మక్క- సారలమ్మ జాతర🌺

🌺కోరిన కోర్కెలు తీర్చే కోటి వరాల కల్పవల్లులుగా… సమ్మక్క సారలమ్మలు ప్రసిద్ధి చెందారు. అందుకే వ్యయ ప్రయాసలు లెక్కచేయకుండా…. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి… వనదేవతల్ని దర్శించుకుంటున్నారు. కొందరు ఏకంగా వందల కిలోమీటర్ల నుంచి కాలినడకన… అమ్మవారి దగ్గరకు చేరుకుంటున్నారు. చల్లగా చూడాలి తల్లీ అంటూ… మొక్కులు చెల్లించుకుంటున్నారు.🌺

🌺వరంగల్ నుండి 92 km మేడారం కలదు🌺

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి