” ఊంఛ ” అనే సంస్కృత పదానికి అర్థము, ” మిగిలిపోయినది ” అని.
.
వేదాలు అహింసకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చాయి. హింస అనేది లేకుండా బ్రతుకుటే జీవన పరమార్థము అని భావించే కాలము ఒకటి ఉండేది. పురాణ కాలములో అత్యంత సాత్త్వికముగను, నియమనిష్ఠలతోనూ బ్రతికేవారికి మహారాజులు కూడా తలయొగ్గి నమస్కరించి మిక్కిలి గౌరవాన్ని ఇచ్చేవారు.
.
అలాగ, అహింసను త్రికరణములతో నూ పాటించేవారు, ఆవుల నుండీ వచ్చే పాలను కూడా త్రాగే వారు కాదు. పాలు పిండటము హింస కాకపోయినా, పాల మీద హక్కు దూడలకు మాత్రమే ఉందని భావించేవారు. కేవలము యజ్ఞ యగాదులకు మాత్రమే పాలను వాడేవారు, అది కూడా గోమాతను పూజించి, అనుమతి తీసుకుని మాత్రమే.
అంతే కాక, చెట్లనుండీ పళ్ళను కోసుకునేవారు కాదు. అలా కోయడము వలన చెట్లకు కొంత బాధ కలుగుతుంది-అని వారి విశ్వాసము.
.తమంతట తామే రాలిన పళ్ళను మాత్రము ఏరుకొని తెచ్చుకునేవారు.
.
మరి ఎలా బ్రతికేవారు ?
ఊంఛ వృత్తి ద్వారా బ్రతికేవారు.
.
అంటే , గోవులు తమంతట తామే పాలు ధారగా కురిపిస్తే ఆ పాలను స్వీకరించేవారు. ఇది వింతగా ఉందా ? అవును, గోవులు , అత్యంత సూక్ష్మ బుద్ధి కల జీవులు. ఎవరికి ఏది అవసరమో గోవులు కనిపెట్టగలవు. కనిపెట్టుటే కాక, తమకు వీలైనంత సహాయము చేసేవి గోమాతలు. కొంతమందిని చూడగానే, అభిమానముతో, ఆప్యాయతతో అవి ఒళ్ళు నాకుతాయి. మరి కొందరికి పాలు ధారగా కురిపిస్తాయి.
ఆ విధముగా , అహింసతోను, అయాచితముగాను వచ్చే పాలు ఒక ఆహారమైతే,
పొలాల్లో కోతలు, నూర్పిళ్ళు , అంతా అయిపోయి, పంటను ఇళ్ళకు చేర్చుకున్న తర్వాత, ఆ పొలాల్లో మిగిలిన ధాన్యాన్ని ఏరుకొని తెచ్చి వాటితో వండిన ఆహారము మరియొక రకము.
.
అంతే కాదు, ధాన్యపు బస్తాలు ఒకచోటినుండీ మరొకచోటికి మార్చునప్పుడు, అంగళ్ళలో కిందపడిపోగా వదిలేసిన ధాన్యాన్ని సంగ్రహించి వాటిని ఆహారముగా స్వీకరించేవారు.
.
అహింస, అయాచితము సరే, ఆ విధానము ఎందుకంటే, నిరంతరము దైవ చింతన, ధ్యానాదులలో ఉంటూ సన్యాసుల్లాగా బ్రతికేవారు ఆహారాన్ని కోరడము కూడా తప్పుగా భావించేవారు. అయాచితంగా దొరికితేనే దాన్ని తీసుకునేవారు. అందుకే సన్యాసులకు దానాలు ఇవ్వాలి, ఇస్తే అత్యంత పుణ్యప్రదము అంటారు.
ఈ విధముగా మొదలైన ఊంఛ వృత్తి, కాల క్రమేణ కొంత మార్పు చెందింది.
.
అలాగ ఊంఛవృత్తి చేసుకొని బ్రతికేవారికి ఆహారం అందించుట అనేది స్వర్గాన్ని ప్రాప్తించ గల పుణ్యము అని భావించేవారు. అటువంటి వారిని వెతుక్కొని వెళ్ళి, వారు అడగకున్నా ధాన్యాన్ని, పళ్ళు మొదలగు ఆహారాన్నీ ఇచ్చేవారు.
.
అటుతరువాత, ఇతరులు అలాగ తమను వెతుక్కొని వచ్చుట కూడా వారికి హింస కలిగించుటేనని భావించి, ఆ వృత్తిలో ఉన్నవారు తామే ప్రతిరోజూ నిర్దిష్ట సమయానికి ఆయా వీధుల్లో వెళ్ళి, తాము వచ్చినది సూచించే వారు. వారు భిక్ష అడిగేవారు కాదు. అడిగితే అది అయాచితము ఎలా అవుతుంది ? కాబట్టి, గంట కొట్టడమో, శంఖము ఊదడమో చేసేవారు.
.
కేవలము తమకు తోచిన ఐదు ఇళ్ళకు మాత్రమే వెళ్ళేవారు. అక్కడ ఒక్క ఘడియ నిలుచుని, వారిస్తే తీసుకుంటారు. లేకుంటే మరొక చోటికి వెళతారు. ఐదు ఇళ్లలోనూ ఏమీ దొరకకుంటే ఆ రోజుకు ఉపవాసమే.
వచ్చినదానిని వండుకుని, దేవుడికి నైవేద్యము చేసి తాము తినేవారు.
.
మరి త్యాగయ్య సన్యాసి కాదు కదా, ఊంఛవృత్తి ఎందుకు చేసేవారు ? ఊంఛ వృత్తి సన్యాసులు మాత్రమే చేసేది కాదు. మీరూ నేనూ కూడా చేయవచ్చు. అందులో వారికి ఆనందము ఉంటే చేస్తారు.
త్యాగయ్య నిరంతరమూ భక్తిపారవశ్యముతో ఉండి, సంసారము గడవాలి కాబట్టి ఊంఛవృత్తికి వెళ్ళేవారు. అది కేవలము ఒక నెపము మాత్రమే. ఆ రామయ్య, త్యాగయ్య చేయి వీడినదెన్నడు ? ఏదో ఒక రకముగా త్యాగయ్యకు కావలసినవి సమకూరేవి.
.
ఊంఛ వృత్తి చేయగలగాలంటే అది అందరికీ సాధ్యము కాదు. భక్తి మార్గములో పరాకాష్ఠ చెందిన స్థితిలో ఉండి, ప్రాణ త్యాగము చేయుట పాపము కాబట్టి, ప్రాణము నిలబెట్టుకొనుటకు ఎంత తినవలెనో, అంత మాత్రమే తింటూ నిరంతరమూ అనుష్ఠానాలలో ఉండగలిగే వారి మానసిక స్థితిని మనము ఊహించగలమా?
చరిత్రలో ఊంఛవృత్తి చేసుకొని బ్రతికిన వారెందరో..
.
వారిలో వేదాంత దేశికులు [ 1268–1370 ], మరియు త్యాగరాజ స్వామి [ 1767–1847 ] చెప్పుకోదగ్గవారు.
వ్యాఖ్యానించండి