కార్తికమాసంలో నెలరోజులూ దీపాలు వెలిగించలేని వారికి ప్రత్యామ్నాయం ఏమిటంటే
నిత్యం తులసికోట వద్ద, పూజగదిలో దీపారాధన చేయవచ్చు. ఏదైనా కారణం వల్ల కొన్నిరోజులపాటు దీపారాధన చేసే అవకాశం లభించకపోవచ్చు. దానికి చింత పడనవసరం లేదు.
ప్రత్యేకించి కార్తికమాసంలో దీపోత్సవాలు విశిష్టమైన ఫలితాలు కలిగిస్తాయి. అందరూ కలిసి సామూహికంగా నిర్వహించుకునే దీపారాధన కార్తికమాసంలో మాత్రమే చేయడం చూస్తుంటాం.
అటువంటి దీపోత్సవాల్లో పాల్గొనవచ్చు. కనీసం కార్తిక పౌర్ణమినాడు లేదా ఆ మాసంలో ఏదైనా ఒక రోజున ‘ఆలయంలో, నదీతీరంలో, పూజగదిలో, తులసికోటవద్ద దీపారాధన చేయడం మంచిది.
కార్తిక పౌర్ణమినాడు సంవత్సరం మొత్తానికి గాను 366 వత్తులను వెలిగించే సంప్రదాయం ఉంది. ఆనాడు దీపారాధన చేస్తే ఏడాది మొత్తం దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది.
కార్తికమాసంలో ఉసిరికాయపై దీపం ఎందుకు వెలిగిస్తారంటే….
వైరాగ్య తైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే…
దీపం వెలిగించడానికి ఓ ప్రమిద కావాలి. అదే మానవ దేహం. పృధివీతత్త్వం. వైరాగ్యంతో కూడిన తైలం, నూనె కావాలి. ఇది జలతత్త్వం. భక్తి అనే వత్తి అందులో ఉంచాలి. అది ఆకాశ తత్త్వం . వెలిగించడానికి అగ్ని కావాలి. వెలిగించిన తర్వాత దీపం అఖండంగా వెలగడానికి గాలి కావాలి. అది ఆ వాయుతత్త్వం. ఇలా పంచతత్వాలతో కూడినదే దీపం.
మానవునిలో ఉండే ఈ పంచతత్వాలకు ఊపిరిపోసే ఉసిరికను దీపశిఖకు ఆధారంగా చేస్తాం. దేహంపై మమకారం వదలిపెట్టడానికి, అజ్ఞానం తొలగి జ్ఞానం పొందడానికి కార్తిక దీపదానం చేస్తాం.
కార్తికమాసంలో దేవుని దగ్గర పెట్టిన దీపం ఎంతసేపు వెలగాలి
దీపం వెలగవలసిన సమయం తక్కువ కాకుండా చూసుకోవడం అవసరం.
దీపం కనీసం గోదోహన కాలంపాటు వెలగాలన్నారు.
అంటే ఆవుపాలు పితికేందుకు పట్టేంత కాలమైన దీపం వెలగాలని అర్ధం. సామాన్య పరిభాషలో అరగంట దాకా వెలిగేంత చమురుపోసి దీపారాధన చేయాలి అలాగే పూజా పూర్తయ్యాక మనంతట మనమే దీపం ఆర్పకూడదు. దానంతట అది ఆరిపోయేవరకు అలా ఉంచాలి. పూజమధ్యలో దీపం ఆరిపోకుండా చూసుకోవాలి.
దీపం ఆరింది అనడం కూడా అపశకునంగా భావిస్తారు. దీపం కొండెక్కింది లేదా ఘనమయ్యింది అంటూ ఉంటారు.
జ్వాలాతోరణం విశిష్టత
మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం.
యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి, వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమశిక్ష…
కార్తీక పౌర్ణమిరోజున సాయంకాలం జ్వాలాతోరణం చేస్తారు, కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు. కార్తీక పౌర్ణమినాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి..
ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు, అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు.
దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది.
ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు.
ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడు సార్లు ఊరేగిస్తారు.
శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణిస్తూ..
“కార్తీక వేళ భీమశంకరుని నగరమందు
దూరునెవ్వాడు చిచ్చుర తోరణంబు
వాడు దూరడు ప్రాణ నిర్వాణవేళ
ఘోర భీకర యమద్వార తోరణంబు..’’
అంటాడు. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణముంది.
యమలోకంలోకి వెళ్లినవారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించు కోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించటం ఒకటే మార్గం.
అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది. అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి…
దీని వెనక మరో తత్వకోణం కూడా ఉంది. జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే ‘‘శివా ! నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా..’’ అని ప్రతీకాత్మకంగా చెప్పటం.
ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి – ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనోపెడతారు. అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని.. ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం.
వ్యాఖ్యానించండి