ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

ఒకొక్క గుడికి ఒక్కో ప్రత్యేకత



మన పూర్వీకులు చాలా గొప్ప వైదిక విజ్ఞానం కలిగిన వారు… వారి వారసులమైన మనం దీనికెంతో గర్వించాలి, పెద్దలు పూర్వకాలంలో దేవాలయాలు(కోవెలలు,గుడులు) నిర్మీంచేటప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించేవారు.

అయితే ఒక్కొక్క కోవెలకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉండేది. ఉదాహరణకు కొన్ని చూద్దాం.

1) ఉత్సవవిగ్రహం లేకుండా మూలవిగ్రహమే బయటకు మాడవీధులకు వచ్చేది చిదంబరం నటరాజస్వామి.

2) కుంబకోణంలో ఐరావతేశ్వరస్వామి గుడి తారాసురం అనే గ్రామంలో వుంది.అక్కడశిల్పకళా చాతుర్యం చాలా గొప్పగా చెక్కబడివుంది. ఒక స్తంభము నుంచి చూస్తె వాలిసుగ్రీవులు యుద్ధం మట్టుకే తెలుసుతుంది ,కొంచం దూరంలో ఇంకొక స్తంబములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడివుంది.

ఇందులో గొప్ప ఏమిటి అంటే మోదటి స్థంబము నుంచి చూస్తె శ్రీరాముడు కనపడడు కాని రెండవ స్తంబము నుంచి చూస్తె వాలిసుగ్రీవుల యుద్దము చాల బాగా తెలుస్తుంది.

3) ధర్మపురి(తమిళనాడు)మల్లికార్జునస్వామీ కోవెలలోన వంగామంటపం అంటే తొమ్మిదిస్తంభముల మంటపం అన్నమాట.
ఇందులో రెండు స్థంబములు భూమిపై ఆనకుండా గాలిలో వేలాడుతున్నట్టుగా ఉంటాయి .

4) కరూర్(కోయంబత్తూర్) సమీపంలోని కుళిత్తలై అనే ఊరిలో కదంబ వననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒకే మండపములో ప్రతిష్ట గావించబడి వున్నాయి.

5) గరుడుడు నాలుగుకరములతో( చేతులతో) అందులో రెంటిలో శంఖచక్రములతో దర్శనము ఇచ్చేది కుంబకోణం ప్రక్కన వేల్లియంగుడి అనే గ్రామ దెవాలయంలోమాత్రమే.

6) కుంభకోణంలో నాచ్చియార్కోవిల్ అనే స్థలంలో విష్ణుగుడి వుంది.అక్కడ గరుడవాహనం రాతితో చేసినది స్వామీ సన్నిధిలో ఉంది అది నలుగురు మోసే బరువు వుంటుంది. కాని క్రమంగా ఒక్కొక్క ప్రాకారందాటి బయటకు వస్తుంటే రానురాను 8,16,32 అలా బయటవీదిలోకి వచ్చేటప్పటికి 64 మంది మోసే అంత బరువు అయిపోతుంది
మరి స్వామీగుడిలోనికి పోతున్నప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది ఇక బయటవీధికి వచ్చేటప్పటికి గరుడవిగ్రహమునకు చెమటపట్టడం కూడా ఒకవిచిత్రమే.

7) చెన్నైసమీపంలో శ్రీపెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల వారి గుడి వుంది అక్కడ మూలస్థానంలో విగ్రహం రాతిది కాదు
పంచలోహవిగ్రహము కాదు కేవలం
కుంకుమపువ్వు పచ్చకర్పూరం మూలికలతో చేసినది, ఆశ్చర్యం కదా.

8) తిరునల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథస్వామి దేవాలయంలో ఒక బిల్వచెట్టు స్థలవృక్షం గా వుంది.ఆ చెట్టుకు కాచే బిల్వకాయలు లింగాకారంలో వుంటాయి.

9) కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుని గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదువర్ణములుగా మారుతూ వుంటుంది అందుకే ఆ కోవేలని పంచవర్నేశ్వరుడు కోవెల అని పిలుస్తారు.

10) విరుదునగర్ ప్రక్కనా ధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుని కోవెలలో నందికి కొమ్ములు చెవులు వుండవు.

11) ఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒకపెద్ద ఆంజనేయ విగ్రహం వుంది.దీని ప్రత్యేకత ఆంజనేయ విగ్రహం కనులు భద్రాచల శ్రీరామసన్నిధిలో శ్రీరాముని పాదములు ఒకే ఎత్తులో వుండడం.

12) వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరి కోవెలలో ఒకస్థంభములో అర్ధచంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు,ఆరునుండి పంన్నెండు వరకు అంకెలు చెక్కబడి వున్నది, పైన వుండే పల్లము నుండి మనము ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం, గడియారం చూసుకొఖ్ఖర లేదు.

13) చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో మూలవిగ్రహం శిరస్సునుంచి నడుమువరకు మానవఆకారం నడుమునుంచి పాదములవరకు మత్స్యఆకారంలో వుంటుంది.

14) ధర్మపురి(తమిళనాడు)పక్కన పదుహారు అంటే పదిమైళ్ళదూరంలో అభీష్టవరదస్వామీ అనే విష్ణుగుడిలో నవగ్రహములు స్త్రీ రూపముతో ఉంటారు.

15)ద్వాదశం రాసుల పై సూర్య కిరణ ప్రసారం -శృంగేరి, కర్ణాటక రాష్ట్రం లో పడమటి కనుమలలో వున్న దివ్య క్షేత్రమే శృంగేరి .ఋష్య శృంగ మహర్షి పావనం చేసిన ప్రదేశం .శృంగ గిరే శృంగేరి గా మారింది .ఆది శంకరా చార్యులు ఇక్కడ శారదా పీఠం నెలకొల్పారు .శారదాలయానికి కుడి ప్రక్కన విద్యా శంకరాలయం వుంది .శ్రీ విద్యారణ్య స్వామి గురువు శ్రీ విద్యా శంకరులు..105 సంవత్స రాలు పీఠాది పత్యం వహించిన పుణ్య పురుషులు అందుకని శిష్యుడు కృతజ్ఞత గా ఈ ఆలయాన్ని కట్టించారు .ఇది 1338 లో నిర్మిత మైంది .
ఇక్కడ ముఖ మండపం లో 12 రాతి స్తంభాలున్నాయి .ఇవి 12 రాశుల పేర్లతో వుంటాయి .సూర్యుడు ఏ రాశి లో ప్రవేశిస్తే ,ఆ పేరు గల స్థంభం మీద ఆ రోజున సూర్య కిరణాలు పడటం ఇక్కడ విశేషం .ఖగోళ ,జ్యోతిష ,గణిత ,వాస్తు శాస్త్రాలలో అపూర్వ పాండిత్యం గల శిల్పులు మలచిన అద్భుత విన్యాసం .స్తంభాల పై సింహం ఆకారం లో జీవ మృగ మూర్తులున్డటం విచిత్రం .వాటి నోటిలో వ్రేలాడే రాతి బంతులు ,పై కప్పు నుంచి వేలాడే రాతి గొలుసులు ,అన్నీ ఒకే శిలతో నిర్మింప బడి ఉండటం ఆశ్చర్య కరం .ఆలయం బయట గోడలు కోణాలు ,కోణాలుగా చెక్క బడి వుండటం ఇంకో విచిత్రాను భూతి .పొడ వైన రాతి పలకలు ప్రక్క ప్రక్కగా నిలబెట్టి అతికించి నట్లు గా అని పిస్తుంది .ఇక్కడి శిల్ప సంపద అసదృశం గా వుంటుంది .

16)శైవ జైన వైష్ణవ సామ రాస్యానికి ప్రతీక ధర్మ స్థల
కర్ణాటక లో మంగుళూరు నుంచి ౪౦ కి.మీ.దూరం లో వున్న చిన్న గ్రామమే ధర్మ స్థలి .ఇక్కడి శివుడు మంజు నాధుడు .పూజారులు రాజా కుటుంబాలకు చెందిన వైష్ణవులు .ఆలయ నిర్వాహకులు జైనులు .ఇదీ ఇక్కడి విశేషం .మత సామరస్యానికి ఒక గొప్ప ఉదాహరణ ధర్మ స్థలం .మంజు అంటే కన్నడం లో మంచు అని అర్ధం .శివుడు మంచు పర్వత మైన కైలాస గిరి పై ఉంటాడు కనుక ఆ పేరు .”వాడి రాజా తీర్ధులు ”అనే వైష్ణవ స్వామి స్వయం గా ఇక్కడ లింగ ప్రతిష్ట చేశారు .దేవ రాజ హేగ్గడే అనే జైన మతస్తుడు మొదటగా విగ్రహాన్ని ప్రతిష్టించి నట్లు తెలుస్తోంది .”కుడుము ”అనే పేరు వున్న ఈ గ్రామం క్రమం గా ధర్మ స్థలి అనే పేరు గా మార్పు చెందింది .జైన దేవుని అతి పెద్ద విగ్రహం అత్యాకర్ష ణీయం గా ఇక్కడికి దగ్గరలో శ్రావణ బెల్గోలా లో వుండటం మరో వింత .నిజాయితీ కి మారు పేరు ధర్మ స్థలి .దొంగతనం అనేది వుండదు .ఎక్కడ పడేసిన వస్తువులు అక్కడే ఎంత కాల మైనా వుంటాయి .అందుకే ఆపేరు వచ్చింది .

17)విరూపాక్ష దేవాలయం హంపి వద్ద ఉంది. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుండి 350 కిలో మీటర్ల దూరంలో ఉంది. విరూపాక్ష అనగా శివుని రూపం. ఈ దేవాలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9 ఖానాలతో 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గోపురములోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి. మిగతా 7 ఖానాలు ఇటుకలతో నిర్మించబడ్డాయి. ఈ తూర్పు గోపురం నుండి లోపలికి ప్రవేశిస్తే బయటి నుండి ఆలయంలోకి వెళ్ళే మొదటి ప్రాకారం స్తంభాలు లేకుండా ఆకాశం కనిపించేటట్లు ఉంటుంది. ఈ ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్తే స్తంభాలతో కూడి కప్పబడిన వసారా ఉంటుంది. స్తంభాలతో కూడి ఉన్న వసారాలో చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి.దీనిని కూడా దాటి లోపలి ప్రాకారంలోకి వెళ్ళితే గర్భ గుడి వస్తుంది. తుంగభద్ర నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంట గదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెడుతుంది. విరూపాక్ష దేవాలయంలోని బయటి ప్రాకారంలో ఏకశిలలో చెక్క బడిన నంది ఒక కి.మీ. దూరం వరకు కనిపిస్తుంది.
గర్భాలయానికి వెనుక, బయటకు వెళ్లడానికి మెట్లదారి ఉంది. అక్కడ పది మెట్లు ఎక్కగానే, కుడి వైపు ఒక చీకటి గది ఉంది. ఆ గదికి తూర్పు వైపున 7 అడుగుల ఎత్తులో ఒక రంధ్రం ఉంది. అందులో నుండి వెలుతురు వచ్చి ఎదురుగా ఉన్న గోడ పై పడి బయట ఉన్న రాజ గోపురం నీడ తల క్రిందులుగా చాల స్పష్టంగా కనబడుతుంది. దాని కెదురుగా ఒక తెల్లని గుడ్డ అడ్డం పెడితే దాని మీద కూడా ఆ గోపురం ప్రతి బింబం కనబడుతుంది. అందరూ దీన్ని చాల వింతగా చూస్తుంటారు. ఆ వస్తున్నది సూర్య కిరణాలు కాదు, కేవలం వెలుగు మాత్రమే. ఈ వింత బయట వెలుగు ఉన్నంత సేపు ఉంటుంది.

ఇలా మనకు తెలియని , తెలిసినా పట్టించు కోకుండా గొప్పగా చెప్పుకోనివి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమవిధానంగా కట్టిన దేవాలయాలు వున్నాయి…

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి