ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

శివుడంటే ఆకాశ తత్వం వివరణ?

⚜️🔱⚜️🌷#శివుడంటే🌷⚜️🔱⚜️



ఎక్కడైతే మనసు చేసే అన్ని పనులూ కరిగిపోతాయో, ఎక్కడ లోతైన మౌనం, స్థిరత్వం మాత్రమే ఉంటాయో ఆ ప్రదేశమే శివుడు.

ఈ ప్రదేశం మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది. దానిని దర్శించడం కోసం మీరు ఎక్కడెక్కడికో తీర్థయాత్రలు చేయనవసరం లేదు. మీరు ఉన్నచోట దేవుని చూడలేకపోతే వేరే ఎక్కడో చూడడం అనేది సాధ్యం కానేకాదు. మీరు స్థిరంగా ఉన్నప్పుడు దైవం అనేది అంతటా ఉన్నదని గమనిస్తారు. ధ్యానంలో జరిగేది ఇదే.

శివునికి గల అనేక పేర్లలో ఆద్యంత హీనం అనేది ఒకటి. అంటే తుది, మొదలు లేని వాడని అర్థం.

శివుడంటే మెడలో పామును ధరించి, ఎక్కడో ఒక దగ్గర కూర్చుని ఉంటాడని మనం అనుకుంటాం
. కానీ.. ఈ విశ్వం అంతా ఎవరిలో జనిస్తున్నదో, ఈ క్షణంలో విశ్వమంతటినీ ఎవరు ఆవరించి ఉన్నారో, ఎవరిలో ఈ విశ్వం అంతా లయమైపోతున్నదో ఆయనే శివుడు.

విశ్వంలో మీరు చూసే ప్రతి ఆకారమూ ఆయన స్వరూపమే. విశ్వం అంతటా అతడు వ్యాపించి ఉన్నాడు.

అతడు ఏనాడూ జన్మించలేదు, అతనికి మరణమూ లేదు. అతడు శాశ్వతుడు.

శివుడికి విరూపాక్ష అనే పేరు కూడా ఉంది.

అంటే ఆకారం లేని వాడు.. అయినా అంతటినీ చూసే వాడు. ఆ

ధునిక భౌతిక శాస్త్రంలోని క్వాంటం మెకానిక్స్‌లో ఈ సిద్ధాంతాన్ని సూచిస్తారు. చూసేవాడు, చూడబడే వస్తువు.. ఈ రెండు కూడా చూడడం అనే పని వలన ప్రభావితం అవుతాయి.

మన చుట్టూ గాలి ఆవరించి ఉన్నదని మనకు తెలుసు. మనం దానిని అనుభవించగలం కూడా. కానీ మనను, మన ఉనికిని ఆ గాలి కూడా అనుభవించగలిగితే? మన చుట్టూ శూన్యం (ఖాళీ ప్రదేశం) ఉన్నదని మనకు తెలుసు. మనం దాన్ని గుర్తిస్తాం. అయితే మన ఉనికిని ఆ శూన్యం కూడా గుర్తించగలిగితే?

దైవం మన చుట్టూ ఉంది, మనల్ని చూస్తూ ఉంది. చూసేవాడు (ద్రష్ట), చూసే విధానం(దృష్టి), చూడబడేది (దృశ్యం) ఇలా వివిధ రూపాలలో విలసిల్లే సృష్టిగా చూడబడుతున్నది, వాటన్నిటి వెనుకా ఏ రూపమూ లేని చైతన్యంగా విలసిల్లుతున్నదీ అదే. ఏ రూపమూ లేని ఆ దివ్యత్వమే శివుడు. ఈ శివతత్వాన్ని అనుభవించటమే శివరాత్రి.

సాధారణంగా ఉత్సవం జరుగుతున్నప్పుడు మన ఎరుక తగ్గుముఖం పడుతుంది. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మనం ఎరుకతో, అప్రమత్తంగా ఉంటాం.

అంతా బాగున్నప్పుడు మనం విశ్రాంతిగా ఉంటాం. శివరాత్రి నాడు మాత్రం.. మనం విశ్రాంతిగా, అదే సమయంలో అప్రమత్తంగా ఉంటాం. గాఢమైన విశ్రాంతి, ఉత్సవం, ఎరుకల కలయికే శివరాత్రి.

శివుడు చైతన్యంలోని నాలుగవ అవస్థ, లేదా తురీయావస్థకు ప్రతీక. తురీయావస్థ అనేది మెలకువ, కల, గాఢనిద్ర అనే మూడింటికీ అతీతమైన స్థితి. అంతటా ప్రత్యక్షమై ఉన్న, రెండవది అనేది లేని చైతన్య స్థితి శివుడు. అందువల్లనే శివుని ఆరాధించాలంటే మొదట నీవు శివునిలో లీనమై పోవాలి. నీవు శివునిగా మారినప్పుడు మాత్రమే శివుని ఆరాధించగలవు.

ఎందుకంటే అతడు చిదానందరూపుడు. అంటే పరమానందస్థితిలో ఉన్న చైతన్యం. తపస్సు, యోగం ద్వారా అతడిని తెలుసుకోగలం కాబట్టి అతనికి తపోయోగగమ్య అని పేరు. యోగం లేకుండా శివుని అనుభూతి చెందలేము.

యోగం అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదు. యోగం అంటే.. ధ్యానం, ప్రాణాయామాల ద్వారా శివతత్వాన్ని అనుభవంలో పొందటం. నీరు, గాలి, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాలూ శివునికి ఐదు ముఖాలుగా చెప్పబడ్డాయి.
ఈ పంచభూతాలను అర్థం చేసుకోవడమే తత్వజ్ఞానం

శివుని పూజించడం అంటే శివతత్వంలో కరిగిపోవటం. అలా కలసిపోయి, సర్వ మానవాళికీ శుభం కలగాలని కోరుకోవటం. అనేకంగా కనిపిస్తున్న ఈ విశ్వం నుండి వాటి వెనుక ఒకటిగా ఉన్న చైతన్యం వైపునకు మన ఎరుకను మరలిస్తుంది శివరాత్రి.

ఓం నమఃశివాయ నమః

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి