మన సనాతన ధర్మంలో చెప్పిన పలు అంశాలలో మనకు అందని సైన్స్ ఉందంటే ఆశ్చర్యమే. కానీ వీటికి సంబంధించిన పలు అంశాలు క్రమేపి రుజువవుతున్నాయి. హిందు దేవాలయాలలో ఖగోళ , ఆర్కిటెక్చర్ ,సైన్స్ , జ్యోతిషం ,వాస్తు ఇలా పలు అంశాలు మిళితమై ఉంటాయి. భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు …. ‘ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం’ అని చెప్పారు. ఈ శరీరం ఒక ఆలయం. మానవ శరీరం దేవుని ఆత్మకోసం ఆలయం. ఆలయ నిర్మాణం వివిధ భాగాలుగా మానవ శరీరంలోని వివిధ భాగాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ ఆలయం దైవిక ఉనికిని కలిగి ఉన్న భౌతిక శరీరం “స్థూల శరీరం”
శరీరం:- ‘శీర్యతే ఇతి శరీరః’ అని వ్యుత్పత్తి అర్థం. శీర్యతే అంటే శీర్ణమైపోయేది, జీర్ణమైపోయేది, శిథిలమైపోయేది అని అర్థం. జీర్ణించిపోవటం – శిథిలమైపోవటం దీని లక్షణం. ముసలితనం కావాలని మనం మందులు మాకులు మ్రింగనక్కరలేదు. అమృత భాండంలో పెట్టినా సరే ఈ శరీరం శిథిలమైపోయేదే, నశించిపోయేదే అందుకే శరీరం అన్నారు.
దేహం:- దేహమని ఎందుకన్నారు అంటే ‘దహ్యతే ఇతి దేహః’ అని వ్యుత్పత్తి అర్థం. దహింపబడేది గనుక దీనిని దేహం అన్నారు. చచ్చిన తరువాత కట్టెలలో కాలుస్తారు గనుక దహింపబడేది అన్నారా అదే నిజమైతే మరి కొందరి దేహాలను కట్టెలతో కాల్చరు గదా ! అవి దహింపబడవు గదా ! మరి వాటిని దేహాలు అని అనరా అంటే చనిపోయిన తర్వాత దహింపబడటం కాదు. జీవించి ఉన్నప్పుడే తాపత్రయాలనే అగ్నిచేత నిరంతరం దహింపబడుతూ ఉండేదే ఈ దేహం. ఆధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక తాపాలే తాపత్రయం.
దేవాలయం:- దేహాన్ని దేవాలయం అని వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఎందుకు అంటే “దేహో దేవాలయ ప్రోక్తః జీవోదేవస్సనాతనః” – అనేది ఉపనిషద్ వాక్యం. ఈ దేహం ఎలాంటి దేవాలయం, ఇది ఒక చోట స్థిరంగా ఉండే దేవాలయం కాదు. ఇది చర దేవాలయం. కదులుతూ ఉండేది. బయట కనిపించే దేవాలయాన్ని మానవులే కట్టిస్తారు. అందులో దేవుణ్ణి కూడా మానవులే ప్రతిష్టిస్తారు.
కాని ఈ శరీరమనే దేవాలయాన్ని భగవంతుడే నిర్మించి, హృదయమనే గర్భగుడిలో తనకు తానే ప్రతిష్టితుడై కూర్చున్నాడు. బయటి గుడికి – ఈ గుడికి అదే తేడా ఇక్కడ భగవంతుడు ‘స్వయంభూ ‘ అన్నమాట. మరి అలాంటప్పుడు ఏ దేవాలయం ముఖ్యమైనదో ఏ దేవుని పూజ గొప్పదో మనం ఆలోచించు కోవాలి. అప్పుడే “దేహం దేవాలయం” అవుతుంది, “హృదయం గర్భగుడి” అవుతుంది, జీవుడు దేవుడౌతాడు.
కానీ మనిషిలో సత్ప్రవర్తన సద్విచారం లేనంత వరకు, మానవునిలో హృదయ పరివర్తనం రానంతవరకు ఎన్ని సాధనలు చేసిననూ ప్రయోజనము లేదు. దయాగుణం, దానగుణం లేనిదే దైవమును ఎన్ని పూజలు చేసిననూ ఉపయోగం ఏమీ ఉండదు. నేడు చాలామంది పుణ్యం వస్తుందని నదులలో స్నాన్నములు చేస్తుంటారు, ఉపవాసాలు చేస్తుంటారు, ప్రదక్షిణలు ,జపాలు చేస్తుంటారు. కానీ వీటి వలన పుణ్యం రాదు. ఇవన్నీ మీ హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి చేసే సాధనలు మాత్రమే! నదులలో స్నానం చేస్తే పాపం పోయి పుణ్యం వస్తుందనుకుంటే చేపలు కంటే పుణ్యాత్ములు ఈ సృష్టిలోనే ఉండవు! ఉపవాసాలు ఉండడం వలన కోరికలు తీరుతాయి అనుకుంటే నిత్యమూ ఆకలితో పస్తులుండే పేదవాడు ఎప్పుడో ధనవంతుడు అయ్యేవాడు! అత్యాశ, సోమరితనం వలన మానవుడు ఇట్టి భ్రమకు లోనగుచున్నాడు. ఇవన్నీ చేయకూడదు అని కాదు, చేయాలి. కానీ అంతటితో ఆగిపోకుండా ఆత్మతత్వమును అర్ధం చేసుకుని హృదయము పరిశుద్ధం చేసుకుని పరమాత్మను అంతరాత్మలో ఆరాధించుకోవాలి. ఏనాడు మీ హృదయాలు పరిశుద్ధమై పరమాత్మ కొరకు పరితపిస్తాయో ఆనాటి నుంచి మీరు నిజమైన పుణ్యాత్ములవుతారు, దన్యాత్ములవుతారని తెలుసుకుని ఆ ప్రకారం నడచుకొండి. అలా హృదయాలు పరివర్తన చెంది, పరమాత్మను ఆత్మలో నిలుపుకోవడం సాకారం అయిననాడే మన దేహం ఒక దేవాలయం అవుతుంది.
వ్యాఖ్యానించండి