తిరుమల పుణ్యక్షేత్రంగా 15 వందల ఏళ్ల పైగా చరిత్ర వుంది. మొట్ట మొదటగా, వైఖానస అర్చకుడు గోపీనాథ దీక్షితులు (శ్రీ వేంకటాచల మహాత్యం అనుసరించి), శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత, చింత చెట్టు క్రింది చీమల పుట్టలో కనుగొని, శ్రీవారి మూర్తిని ప్రస్తుతం వున్న ప్రదేశంలో ప్రతిష్ఠించి, అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పటి నుండి గోపీనాథ దీక్షితుల యొక్క వంశీయులే పరంపరగా స్వామి వారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు.
మధ్యయుగ చరిత్ర
పల్లవ రాజు శక్తి విటంకన్ భార్యయైన రాణి సామవై పెరిందేవి క్రీ.శ. 966 లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని అర్చకులు సూచించిన విధంగా శ్రీ వైఖనస భగవఛ్ఛాస్త్రోక్తంగ ప్రతిష్ఠింపజేసింది. ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయంలోని గోడల మీది శాసనం వలన తెలుస్తోంది. ఆమె అనేక ఆభరణాలు, రెండు ప్రాంతాలలో భూమిని (10 ఎకరాలు, 13 ఎకరాలు విస్తీర్ణంగల) విరాళంగా ఇచ్చింది. ఆ భూమి నుండి వచ్చే ఆదాయాన్ని ఆలయంలో ప్రధాన పండుగ వేడుకలకు ఉపయోగించుకోవాలని ఆదేశించింది.
పల్లవ రాజవంశం (9 వ శతాబ్దం), చోళ రాజవంశం (10 వ శతాబ్దం), విజయనగర రాజులు (14 మరియు 15 వ శతాబ్దాలు) వెంకటేశ్వరస్వామిని ఆరాధించారు. తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీ.శ.1328లో, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధయాధవరాయలు క్రీ.శ.1429లో, హరిహరరాయలు క్రీ.శ. 1446లోను బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ ఆలయం ప్రస్తుత సంపద, పరిమాణం లో చాలా భాగం విజయనగర సామ్రాజ్యం రాజులు వజ్రాలు, బంగారాన్ని విరాళంగా ఇవ్వడం ద్వారా పొందింది. సాళువ నరసింహరాయలు 1470 లో భార్య, ఇద్దరు కుమారులు, తన పేర్లతో సంపగి ప్రదక్షిణం నాలుగు మూలలలో నాలుగు స్తంభాల మండపాలను నిర్మించాడు. 1473లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు. కృష్ణదేవరాయలు క్రీ.శ.1513 నుండి 1521 వరకు ఏడు సార్లు తిరుమలకి వచ్చి ఇచ్చిన బంగారం, ఆభరణాల దానం, 1517 లో ఆనంద నిలయం (గర్భగుడి) పైకప్పుకు బంగారు పూత పూయడానికి వీలు కల్పించింది. 2 జనవరి 1517 న కృష్ణదేవరాయ ఆలయంలో తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆలయానికి ఇంకొన్ని విరాళాలు ఇచ్చాడు. అచ్యుత రాయలు 1530లో ఉత్సవాలు నిర్వహించాడు. తిరుమల రాయలు 16వ శతాబ్దం చివరలో, అన్నా ఊయల మండపాన్ని విస్తరింపజేసి, ఉత్సవాలు నిర్వహించాడు. వెంకటపతి రాయలు 1570లో చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు. 1320-1369 మధ్య శ్రీరంగపట్నం రంగనాథ ఆలయ విగ్రహాలను భద్రపరచడానికి ఈ ఆలయంలో ఉంచారు.
విజయనగర సామ్రాజ్యం క్షీణించిన తరువాత, మైసూర్ రాజ్యం, గద్వాల్ సంస్థానం వంటి రాష్ట్రాల నాయకులు భక్తులుగా పూజలు చేసి ఆలయానికి ఆభరణాలు, విలువైన వస్తువులను ఇచ్చారు. ఈ ఆలయం జూలై 1656 లో గోల్కొండ నవాబు చేతుల్లోకి వెళ్లింది. తరువాత అది కొద్ది కాలం పాటు ఫ్రెంచ్ పరిపాలనలో వుండి, ఆ తరువాత సా.శ.1801 వరకు కర్ణాటక నవాబు పరిపాలనలో వుంది. కర్నాటకకు నవాబైన దావూద్ ఖాన్ హైదరాబాదు నిజామ్ కు కట్టవలసిన పన్నులను సమకూర్చుకునేందుకు, ఆలయంపై పన్నులు విధించాడు. ఈ విషయంగా మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు. మరాఠా సైనికాధికారి రాఘోజీ భోంస్లే ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ఆరాధన కోసం శాశ్వత పరిపాలనను ఏర్పాటు చేశారు.
19 వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారి ఆగమనంతో, ఆలయ నిర్వహణ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వచ్చింది. వారు ఆలయానికి ప్రత్యేక హోదాను ఇచ్చి కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా ఉన్నారు. మద్రాస్ ప్రభుత్వం 1817 లో జారీచేసిన ఏడవ రెగ్యులేషన్‌ను ప్రకారం, ఆలయం ఉత్తర ఆర్కాట్ జిల్లా కలెక్టర్ ద్వారా రెవెన్యూ మండలి నియంత్రణలోనికి తెచ్చింది. 1821 లో, బ్రూస్ అనే బ్రిటీషు అధికారి ఆలయ నిర్వహణ కోసం నియమాలను రూపొందించారు, దీనిని బ్రూస్ కోడ్ అని పిలుస్తారు. 7 వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ఆలయానికి ₹ 8,000 విరాళంగా ఇచ్చాడు.
1843 లో ఈస్ట్ ఇండియా కంపెనీ తిరుపతిలోని ఇతర దేవాలయాలతోపాటు తిరుమల ఆలయ పరిపాలనను హథీరాంజీ మఠం మహంతులకు బదిలీ చేసింది.1870లో యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు మెట్లు నిర్మించారు. 19 వ శతాబ్దాంతానికి కొండపైన శ్రీవారి ఆలయం, విశాలమైన హథీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలూ ఉండేవి కావు. అతికొద్దిగా ఉండే ఇళ్ళు అత్యంత సంకుచితంగా ఉండేవి. కోతుల బెడద విపరీతంగా ఉండేది. అడవి పందులు కొండపై మనుష్యుల నడుమ నడుస్తూనే వుండేవి. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ, గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. 1933 లో టిటిడి చట్టం ఫలితంగా తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు ఏర్పడే వరకు అనగా 90 ఏళ్ళ పాటు ఆరు తరాల మహంతుల పాలనలో ఉంది. టిటిడి బోర్డు ఏర్పడ్డాక 1933లో రూ.26 వేల ఖర్చుతో మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. 1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండమీదకు రోడ్డుమార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు. 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తయింది. మొదట్లో ఎద్దులబళ్లు, గుర్రపుబళ్లు తిరిగేవి. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల-తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు పెరగసాగింది.
తిరుమల దేవస్థానం 1951లో మద్రాస్ హిందూ మత, ఛారిటబుల్ ఎండోమెంట్ చట్టం పరిధిలోకివచ్చింది. 1966 లో, ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ నియంత్రణలోకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్, హిందూ మత సంస్థలు మరియు ఎండోమెంట్స్ చట్టం. 1979 ప్రకారం, 1966 చట్టం రద్దు చేసి తిరుమల తిరుపతి దేవస్థానాల చట్టం ఏర్పరచారు. దీని ప్రకారం ఆలయ పరిపాలన కార్యనిర్వాహకాధికారి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించే ముగ్గురు సభ్యుల మండలికి అప్పగించబడింది. 1974లో రెండవ ఘాట్‌రోడ్డును(ప్రస్తుత ఎగువ రోడ్డు) కూడా నిర్మించారు. 1980లో తితిదే బోర్డు మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుద్దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేసింది.
ఈ ఆలయంలో కన్నడ, సంస్కృతం, తమిళం, తెలుగు భాషలలో సుమారు 640 శాసనాలు ఉన్నాయి. తాళ్లపాక అన్నమచార్యులు, అతని వారసుల తెలుగు సంకీర్తనలు 3000 రాగి పలకలపై చెక్కబడినవి వున్నాయి. ఈ సేకరణ సంగీత శాస్త్రవేత్తలకు, తెలుగు చారిత్రక భాషా శాస్త్రవేత్తకు విలువైన మూలం.
2006 లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవిత్రమైన తిరుమల కొండలపై చర్చిని నిర్మించాలని నిర్ణయించింది. తిరుమల ఏడు కొండలలో రెండు మాత్రమే హిందూ ఆరాధనకు వాడుకొని మిగిలిన వాటిని ఇతర ఉపయోగాలకోసం వాడుకోవచ్చని, క్రైస్తవం పాటించే ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో నిర్ణయం చేశారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అంతటా తీవ్ర నిరసనలు వ్యక్తమవగా చివరకి, ఏడు పవిత్ర కొండల విస్తీర్ణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహించాలని న్యాయస్థానం ప్రకటించింది.
వ్యాఖ్యానించండి