ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

స్త్రీలు రుద్రాక్ష ధారణ చేయవచ్చా ?



స్త్రీలు రుద్రాక్ష ధారణ చేయవచ్చా, లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది స్త్రీలు రుద్రాక్షలు ధరించకూడదని ఎక్కడా చెప్పలేదు. స్త్రీలకు ఋతుస్రావం ఆగేవరకూ ధరించడం మంచిది కాదు అంటారు కాని శివునికి ఏ విధమైన అంటు ముట్టు ఉండదు అసలు శివుడే శ్మశానవాసి సృష్టిలలో స్మశానం కంటే మరొక ప్రదేశం ఉండదు. ప్రపంచంలోనే హైందవ దేవాలయాలు ఏదేశంలోనైనా గర్భాలయంలో ప్రవేశం ఉన్నా లేకపోయినా శివాలయంలోనికి వెళ్ళవచ్చు ద్వాదశ జ్యోతిర్లింగా నైనా నేరుగా చేతితో తాకవచ్చు.(ఎవ్వరైనా, ఏపరిస్థితిలో ఉన్నా) ఉదాహరణకి శ్రీశైలంలో శివలింగాన్ని ఎవరైనా స్వయంగా తాకవచ్చు అలాగే కాశిలో శివలింగాన్ని సైతం ఎవరైనా స్వయంగా తాకవచ్చు. ఇది అందరికి తెలిసిన సత్యమే శివునికే అంటులేనప్పుడు ఆయన స్వరూపములైన రుద్రాక్షలకు దోషమేముంటుంది. అయితే వీటన్నింటికి మించి మన మనస్సుకు మించినది ఏదీ లేదు.

హిందూ శాస్త్రాల్లో, పురాణాలలో రుద్రాక్షకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. ఎందుకంటే… రుద్రాక్ష శక్తిభరితమైందే కాదు… ఔషదీగుణాలు కూడా కలిగి ఉంటుంది. అందుకే పూర్వం రుషులు కూడా రుద్రాక్షతో తమ శరీర శోభన వృద్ధి చేసుకున్నారు. వీటిని కేవలం మనుష్యులకే కాదు… దేవతలు కూడా రుద్రాక్షను ధరించి, ధన్యులుగా భావించేవారు. రుద్రాక్షను ధరించిన వ్యక్తి సాక్షాత్తూ రుద్రునికి సమానమని పురాణాల్లో కూడా చెప్పబడింది. పూర్వం ఋషులు కూడా ఈ రుద్రాక్షను ధరించి, కొన్ని వేల సంవత్సరాల వరకు తపస్సు చేసి, అనేక సిద్ధులు సంపాదించుకున్నారు. రుద్రాక్షను ధరించిన వ్యక్తి కూడా సమస్త పాపాలనుంచి విముక్తి చెంది మోక్షం పొందుతాడని ఆనాటి పూర్వకాలపు రుషులు పేర్కొన్నారు. అయితే వీటిని ధరించడానికి కొన్ని ధార్మికమైన విధానం వుంది. విద్యుక్తంగా ధరించిన రుద్రాక్ష మహిమ… సహస్ర అధికం అవుతుంది. రుద్రాక్ష పరమశివుని భూషణం. అకాల మృత్యువుని జయించి, దీర్ఘాయువునిస్తుంది. గృహస్థులకు అర్ధకామాలను… సాధకులకు ధర్మమోక్షాలను ప్రసాదిస్తుంది. రుద్రాక్ష కేవలం ధార్మికంగానే కాదు… ఆయుర్వేదిక – భౌతిక – సాధనాత్మక రంగాల్లో కూడా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో అనేక వ్యాధులను నయం చేయడానికి దీనితో చికిత్స చేస్తారు. రుద్రాక్షలోని రకాలు – వాటి వల్ల కలిగే ప్రయోజనాలు :
1. ఏకముఖి : ఇది స్వయంగా బ్రహ్మ స్వరూపం. ఇది వున్నచోట లక్ష్మి నివసిస్తుంది.
2. ద్విముఖ : ఇది సాక్షాత్తు అర్ధనారీవ్వర స్వరూపం. సర్వ కామప్రదం.
3. త్రిముఖ : ఇది అగ్నిస్వరూపం. దీనిని ధరించడంతో సంపద, తేజస్సు, ఆత్మబలం వృద్ధి చెందుతాయి. ఇది విద్యాదాత కూడా.
4. చతుర్ముఖి : ఇది కూడా సాక్షాత్తు బ్రహ్మ స్వరూపం. ఇది ధర్మార్ధ కామమోక్షాలు అనే నాలుగు పురుషార్థాలను ప్రసాదిస్తుంది.
5. పంచముఖి : ఇది సాక్షాత్తూ రుద్ర స్వరూపం. అన్ని కోరికలు తీర్చి, సమస్త పాపాలను సంహరించి మోక్షం ప్రసాదిస్తుంది. 108 రుద్రాక్షలతో కూడిన మాలను ధరిస్తే విశేష ఫలం లభిస్తుంది.
6. షణ్ముఖ : ఇది కార్తికేయుని స్వరూపం. దీనిని కుడిభుజానికి ధరిస్తారు. బ్రహ్మహత్యలాంటి మహాపాపాలను కూడా ఇది పరిహరిస్తుంది.
7. సప్తముఖి : ఇది సప్తఋషి స్వరూపం. కంఠంలో లేదా కుడిభుజానికి ధరించవచ్చు. దీనిని ధరిస్తే… దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు.
8. అష్టముఖి : ఇది అష్టభుజాదేవి స్వరూపం. దీనిని ధరించి అల్పుయువులకు అరిష్టం తొలగి, ధీర్ఘాయువు లభిస్తుంది.
9. నవముఖి : ఇది నవదుర్గా స్వరూపం. సిరిసంపదలను పొందడానికి దీనిని ధరిస్తారు.
10. దశముఖి : ఇది సాక్షాత్తు విష్ణు స్వరూపం. అన్ని కోరికలను తీరుస్తుంది.
11. ఏకాదశముఖి : ఇది హనుమాన్‌ స్వరూపం. దీనిని ధరించడం వల్ల ఆధ్యాత్మిక శక్తితో పాటు సర్వత్రా జయం లభిస్తుంది.
12. ద్వాదముఖి : ఇది ఆదిత్య స్వరూపం. దీనిని ధరించడం వల్ల నేత్రకాంతి వృద్ధి చెందడంతో పాటు… మంచి బుద్ధి, ఆరోగ్యం కూడా పెంపొందుతాయి.
13. త్రయోదశముఖి : ఇది ఇంద్రుని స్వరూపం. అన్ని భోగభాగ్యాలు కలుగుతాయి. అభీష్టప్రాప్తి కలుగుతుంది.
14. చతుర్దశముఖి : ఇది పరమశివుని స్వరూపం. దీన్ని ధరించడం ద్వారా సర్వదేవతల దయ లభిస్తుంది.
15. గౌరీశంకర రుద్రాక్ష : ఇది పార్వతీపరమేశ్వర స్వరూపంగా వృక్షంతో కలిసి ఉంటుంది. అభీష్టప్రాప్తి, సమృద్ధిని కలిగిస్తుంది.

రుద్రాక్షలు ధరించి ఉన్నప్పుడు చెడు పనులకు మనస్సు అంగీకరించదు. ఉదాహరణకు మాంసాహారాన్ని తినేటప్పుడు వాటిని తీసి పక్కనపెట్టి తరువాత ధరిస్తే మంచిది ఎందుకంటే ఇందాక మనం చెప్పుకొన్నట్లు మన మనస్సు ఈ విషయంలో అంగీకరించదు కారణం రుద్రాక్షలంటే పవిత్రమైనవి, శివునకు ఇష్టమైనవి, శక్తి వంతమైనవి అని మన మనస్సుకు తెలుసుకాబట్టి ఆవిధంగా తిరిగి మళ్ళీ ధరించడం మంచిది అప్పుడు ఏవిధమైన దోషములు ఉండవు స్త్రీలు కూడ ఆ మూడు రోజులు పక్కన పెట్టి తదుపరి ధరించడం మంచిది ధరించేముందు కొంచం నీళ్ళు చల్లి సుద్ధిపరిస్తే ఇంకా మంచిది. సన్యసించిన వారు యోగినులు రుద్రాక్షలు ధరించడం మనం చూస్తూ ఉంటాము మన పురాణగ్రంధాలలో పిల్లలకు ఆరు సంవత్సరములు వచ్చే వరకూ అయినా రుద్రాక్షలు ధరింపజేయడం వలన వారి భవిష్యత్తు ఎంతో ఉన్నతంగా ధన, కనక, వాస్తువాహనములతో మంచి కీర్తి కలిగి ఉంటారని చెప్పారు.

చదువుకొనే ఆడపిల్లలు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే వారి విద్యలో బాగా రాణిస్తారు. రుద్రాక్షలు దైవ స్వరూపాలు, క్షుద్రాలు గాదు దైవానికి సంబంధించిన విషయంలో దోషాలు ఉండవు. దేవుని గుడిలోకి వెళ్ళేటప్పుడు పాదరక్షలు బయట విడిచి వెళతాము అలాగే ఏదైనా వెళ్ళకూడని పనికి రుద్రాక్షలు ధరించి (చనిపోయిన చోటికి) వెళ్ళిన లేక ఋతుస్రావం సమయంలో రుద్రాక్ష ధరించి ఉన్నా ఆ తరువాత నీళ్ళతో కడిగి తర్వాత పాలతో శుద్ధిచేసి, మళ్ళీ నీళ్ళతో కడిగి ధారణ చేయాలి మనం తెలియక చేసిన దానికి దోషం లేదు అంటే ఒక ఆసుపత్రికి వెళ్ళామంటే అక్కడ చనిపోయిన వారు ఉండవచ్చు బయటకి వెళితే ఎదురురావచ్చు ఇవి దోషాలు కాదు. మనం తెలిసి వెళ్ళినప్పుడు రుద్రాక్షలు ఇంట విడిచి వెళ్ళాలి యజ్ఞోపవీతాన్ని అపసవ్యం చేసినట్లు గానే దీనికి పాటిస్తే చాలు.

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి