ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

విఘ్నేశ్వరుణ్ని విద్యాగణపతి అని ఎందుకు పిలుస్తారు?

విఘ్నేశ్వరుణ్ని విద్యాగణపతి అని ఎందుకు పిలుస్తారు?

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

చదువంటే గణపతికి ఇష్టం. నారదుడు , బృహస్పతి ద్వారా కేవలం అరవై నాలుగురోజుల్లో విద్యలు నేర్చిన ఘనుడు. ఆయన సామర్థ్యం గురించి ఓ చిన్న ఇతివృత్తం కూడా ఉంది.

వేదవ్యాసుడు భారతం రాయాలనుకున్నప్పుడు వేగంగా రాసే లేఖకుడు ఉంటే బావుండునని అనుకున్నాడట. గణపతి దగ్గరకు వచ్చాడట. *‘లక్ష శ్లోకాలు చెబుతాను వేగంగా రాసిపెడతారా !’* అని అడిగాడట. *‘మీరు వెంట వెంటనే చెబుతుండాలి. చెప్పడం ఆపితే నేను మాయం అవుతా !’* అన్నాడట గణపతి. *‘సరే ! నేను చెప్పే శ్లోకాలను అర్థం చేసుకుని రాయగలిగితే.. నేనూ వేగంగా చెబుతా !’* అన్నాడట వ్యాసుడు. సరస్వతి నది తీరాన మహాభారత రచన మొదలైంది ! వ్యాసుడు ప్రతి వంద శ్లోకాల మధ్యలో అతికఠినమైనవి చెబుతుండేవాడట. వినాయకుడు వాటిని అర్థం చేసుకుని రాసేలోపు మిగతా వంద గుర్తు తెచ్చుకునేవాడట. చివర్లో మరో పది శ్లోకాలు చెప్పాల్సి ఉండగా.. వ్యాసుడి కవిత్వ ధార ఆగిపోయింది ! తన షరతు ప్రకారం వినాయకుడు మాయమయ్యాడు. తన రచన ఆ మేరకు అసంపూర్ణంగా మిగిలిపోయిందని శోకించాడట వ్యాసుడు. సరే.. తానే రాస్తానని తాళపత్రాలు తీసి చూస్తే.. ఏముంది ? ఆయన చెప్పాల్సిన పది శ్లోకాలు అక్కడే ఉన్నాయట. అంటే.. ఆ శ్లోకాలన్నీ విఘ్నాధిపతికి ముందే తెలుసు. లేదా.. వ్యాసుడు తన రచన ఎలా ముగిస్తాడో ముందుగానే వూహించాడు ! వ్యాసుడు గణపతికి కృతజ్ఞతతో *‘నీ పుట్టిన రోజున పుస్తకాలను ఉంచి పూజించే విద్యార్థులు సర్వశుభాలూ పొందుతారు. సకల విద్యలు అబ్బుతాయి’* అని ఆశీర్వదించాడట. అందుకే విఘ్నేశ్వరుణ్ని విద్యాగణపతి అని కూడా పిలుస్తారు.

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి