అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది.
అసలు జన్మలు 3 రకాలు..!
1) దేవజన్మ
2) మానవజన్మ
3) జంతుజన్మ.
జన్మలు ఎలా వస్తాయి వాటి ప్రత్యేకతలేమిటి….
మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి.
వాటినే కర్మఫలాలు అంటారు…
అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి…
అందులో అన్నీ పుణ్య కర్మలఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మ నెత్తుతాడు.
అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగభూమి, కనుక అక్కడ అతడికి ఏ కర్మలూ చేసే అధికారం లేదు.
అందువల్ల పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడ లేదు, తన కర్మఫలాలననుసరించి భోగాలనుభవించి, ఆ కర్మఫలాలు క్షయంకాగానే… “ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ” అన్నట్లు
ఈ మర్త్యలోకాన్ని… మానవ లోకాన్ని చేరుకోవలసిందే!
మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే!
ఈ దేవజన్మలో కేవలం మనోబుద్ధులుంటాయి గాని కర్మజేయుటకు సాధనమైన స్థూలశరీరం ఉండదు.
కనుక భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు దేవజన్మ…
ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనులందు జన్మిస్తాడు.
ఆ జన్మలలో ఆ కర్మ ఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడతాడు…
జంతుజన్మలలో కర్మలు చేస్తున్నట్లు కన్పించినా, ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని చేసేవి కావు.
కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి, కారణం ఈ జంతుజన్మలలో శరీరం – మనస్సు ఉన్నాయి గాని బుద్ధి మాత్రం లేదు.
కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించుటయే గాని పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు.
కనుక భగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు!
ఇక పుణ్యపాపకర్మలఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది.
ఈ జన్మలలో పుణ్య కర్మఫలాల కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు…
పాపకర్మఫలాలకారణంగా దుఃఖాలు, బాధలు అనుభవిస్తాడు…
అయితే ఇలా కర్మఫలాలనుభవించటం మాత్రమే గాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవజన్మలోనే ఉన్నది…
ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధితో ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా శరీరం, మనస్సు, బుద్ధి అనే 3 సాధనాలు ఉన్న జన్మ ఇది.
కనుక పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మను ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది అన్నారు…
84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానవ జన్మను…
“జంతూనాం నరజన్మ దుర్లభం” అని ఆచార్య శంకరులు “వివేక చూడామణి” గ్రంధంలో తెలియజేయటం జరిగింది…
ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమమైన మానవజన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి…
వ్యాఖ్యానించండి