ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

ధర్మ సందేహాలు – ఆషాఢ మాస ప్రాముఖ్యత

🙏🌺ఆషాడ మాసం ప్రారంభం
ఆషాఢ మాస ప్రాముఖ్యత🌺🙏

🌺పూర్వాషాడ నక్షత్రం లో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడ మాసం గా చెప్పబడింది. ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని అంటారు. వర్షఋతువు కూడా ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది. ఈ మాసం లో చేసే స్నానం, దానం, జపం , పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడం లో చేసే సముద్ర నదీస్నానాలు ఎంతో ముక్తిదాయకాలు . ఆషాఢమాసం లో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. 🌺

🌺ఆషాడ మాసం లోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకం లోనికి సూర్యుడు ప్రవేశించడం తోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనం లో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణం గా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది.

ఈ మాసం లోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ కూడా. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఆషాడ శుద్ద విదియ నాడు పూరీ జగన్నాధ, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగ గా జరుపుతారు.

ఆషాడ శుద్ద పంచమి స్కంధ పంచమి గా చెప్తారు. సుబ్రమణ్య స్వామి ని ఈ రోజు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఆషాడ షష్ఠి ని కుమార షష్ఠి గా జరుపుకొంటారు🌺

🌺ఆషాడ సప్తమి ని భాను సప్తమి గా చెప్పబడింది. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న ప్రభాకరుడు మూడు నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిమనానం గా ఉంటాయి.

ఆషాడ శుద్ద ఏకాదశి ని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు. ఈరోజు నుండి చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అని అంటారు.

ఆషాడ మాసంలోనే తెలంగాణా ప్రాంతం లో సంప్రదాయబద్దమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనం గా చెప్తారు( భోజనానికి వికృతి పదమే బోనం) . దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు. 🌺

🌺ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం లో ఈ పండుగ అత్యంత వైభవం గా జరుపుకొంటారు. సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్ళు, వేపాకులు ఈ బోనం లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికలిగించే వ్యాదుల నుండి ఉపకరించేవి. ఈ సమయం లో ప్రకృతి లో జరిగే మార్పుల వలన అనారోగ్యాలపాలు కాకుండా ఇవి ఎంతో మేలు చేస్తాయి.🌺

🌺ఆషాఢమాసంలో చేసి తీరాల్సిన పనులు

వర్షాకాలంతో పాటుగా ఆషాఢమాసం ప్రవేశిస్తుంది. ఆ ఆషాఢమాసంతో తనతో కొన్ని ఆచారాలనూ తీసుకువస్తుంది. అవన్నీ ఉత్త చాదస్తాలంటూ కొంతమంది కొట్టివేయవచ్చుగాక, ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవచ్చుగాక! కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనకా ఓ కారణం కనిపిస్తుంది. కావాలంటే మీరే చూడండి.🌺

🌺పేలాల పిండి

ఆషాఢంలో వచ్చే గాలి, నీటి మార్పులతో కఫసంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే! ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. పేలాలు కఫాన్ని తగ్గిస్తాయి, జీర్ణశక్తికి మెరుగుపరుస్తాయి. వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లం, యాలుకలు శరీరంలో వేడిని పెంచుతాయి. అందుకే ఆషాఢంలో వచ్చే తొలిఏకాదశి రోజున తప్పకుండా పేలాలపిండి తినాలని చెబుతూ ఉంటారు.🌺

🌺మునగాకు

మునగాకు ఒంటికి మంచిదని ఆయుర్వేదం తేల్చింది. లేత మునగాకు తింటే కంటిసమస్యలన్నీ తీరిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తూ ఉంటారు. కానీ మునగాకు చేదుగా ఉంటుంది. పైగా విపరీతమైన వేడి. అలాంటి మునగాకుని తినేందుకే ఇదే అనువైన కాలం. లేత మునగాకు దొరకాలన్నా, ఒంట్లో వేడి పెరిగినా ఫర్వాలేదనుకున్నా… వర్షాకాలమే అనువైన సమయం. మునగాకుతో బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడినీ పెంచినట్లవుతుంది. అందులోని పోషకాలను నిర్భయంగా అందుకునే అవకాశమూ దక్కుతుంది.🌺

🌺దానాలు

ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయనం, పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెబుతుంటారు. కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది అనువైన సమయమని అంటారు. ముఖ్యంగా గొడుకు, చెప్పులు దానం చేయమని సూచిస్తూ ఉంటారు. వర్షాకాలంలో ఈ రెండు వస్తువులూ ఎంత అవసరమో చెప్పనవసరం లేదు కదా🌺

🌺సముద్రస్నానాలు

ఆకామావై పేరుతో సముద్రస్నానానికి అనువైన మాసాలలో ఒకటిగా ఆషాఢమాసాన్ని పేర్కొంటారు. ఆషాఢం వరకూ సముద్రపు ఉపరితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది. వర్షరుతువుతో పాటుగా అందులోకి కొత్త నీరు చేరుతుంది. ఆ నీరు ఉరకలు వేస్తూ సముద్రంలోకి చేరే సమయంలో మొక్కలు, ఖనిజాలలో ఉన్న ఔషధగుణాలని తనతో పాటుగా తీసుకువస్తుంది. అలాంటి సముద్రస్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది.🌺

🌺గోరింటాకు :

ఆషాఢంలో వర్షాలు ఊపందుకుంటాయన్న విషయం తెలిసిందే! అలా తరచూ వర్షపు నీటిలో నానుతూ ఉంటారు. ఇక పొలం పనులలో పాల్గొనేవారైతే రోజూ నీటిలో తడవక తప్పదు. దాంతో గోళ్లు సందున నీరు చేరి చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. గోళ్లు కూడా పెళుసుబారిపోతాయి. ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేసే సత్తా గోరింటాకుకి ఉంది. పైగా గోరిటాకుని పెట్టుకోవడం వల్ల కఫసంబంధమైన దోషాలు కూడా తగ్గుతాయని పెద్దలు చెబుతుంటారు.🌺

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి