ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

తల్లి తండ్రులు – ఆచార్యులు – జ్ఞానం!

శరీరానికి జన్మ ఇచ్చే వారిని తల్లి తండ్రులు అని కీర్థిస్తాం.
అట్లానే మనకు జ్ఞాన జన్మని ఇచ్చే మహనీయులు కూడా కొందరు ఉంటారు,
వారినీ తల్లి తండ్రులు అని అంటాం.
జ్ఞానం అని మనం దేన్ని అంటున్నాం… అంటే జ్ఞానం శరీర లక్షణం కాదు.
పైకి కనపడే శరీరం అన్ని భాగాలతో కనిపించినా ఒక నాడు దాన్ని శవం అని పేరు పెడతారు.
కానీ అందులో జ్ఞానం ఉండదు, జ్ఞానం అనేది ఆత్మకు చెందినటువంటి ఒక లక్షణం,
ఆత్మ ఎంత వరకు శరీరంలో ఉంటే అన్ని భాగాలు పనిచేస్తాయి,
లేకుంటే పని చెయ్యవు. జ్ఞానం సహజంగానే ఉంటుంది, కానీ మూసివేయబడి ఉంటుంది.
ఆ మూసి వేసిన జ్ఞానాన్ని సరిగ్గా పనిచేసేట్టు చేయ గల్గిన మహనీయులనే ఆత్మకి జన్మ ఇచ్చిన వ్యక్తులు అంటాం….
మనం ఒకనాడు నామ రూపాలు లేకుండా, ఒకనాడు ఒక మూలన పడి ఉంటే ఒక రూపం వచ్చేట్టు చేస్తారు తల్లి తండ్రి కూడా. మనమేమిటో, జ్ఞానం ఏమిటో తెలియని స్థితిలోంచి మన స్వరూపాన్ని, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మనకు ఉన్న సంభందాన్ని తెలియజేసి మన జ్ఞానాన్ని వికసింపజేసే వ్యక్తులని కూడా మనం తల్లి తండ్రి అని అంటాం.
అయితే శరీరానికి జన్మనిచ్చిన వారిని శరీరానికి తల్లితండ్రులు అని అంటాం, మన జ్ఞానాన్ని వికసింపజేసిన వారిని మన తల్లి తండ్రులు అని అంటాం.
మనం అంటే ఆత్మ అనే అర్థం. మనం అంటే శరీరం అని అర్థం కాదు.
ఈ జ్ఞానాన్ని ఆచార్యుడు తన ఉపదేశం ద్వారా చేస్తాడు.
ఉపదేశం అనేది మంత్ర రూపంలోనో, గ్రంథ రూపంలోనో చేస్తారు.
లోకంలో తల్లి మనల్ని పోషించి పెద్దచేసినట్లే, ఉపదేశం అనేది మన జ్ఞానాన్ని పెంచి పెద్ద చేస్తుంది. అందుకే…

‘మంత్రో మాతాః గురుః పితాః’ …అని అంటారు.
గురువు తండ్రి, గురువు ఉపదేశం మన తల్లి అని అంటారు. జ్ఞానం అనేది లౌకికం గానూ మరియూ అలౌకికం గానూ ఉంటుంది. భౌతిక మైన వాటిని తెలిపేవారూ గురువులే కానీ ఆత్మ స్వరూప జ్ఞానాన్ని ఇచ్చేవారినే మనం వాస్తవిక గురువు అని అంటాం. ఎందుకంటే ఆత్మ జ్ఞానం కలగటమే నిజమైన జన్మ అని ఉపనిషత్తులు అంటాయి. ఆత్మ జ్ఞాన ప్రదాతలనే మనం ఆచార్య అని కీర్థిస్తాం.

మానవ జాతికి వేదాల్లోనూ, ఇతిహాసాల్లోనూ, పురాణాల్లోనూ నిక్షిప్తమై ఉండే ఆత్మ స్వరూపాన్ని తెలిపే నిఘూడమైన విషయాలను వెలికితీసి అందించిన మన ఋషులంతా మన ఆచార్య స్థానులు.
వారు చేసిన ఉపకారం ఒకటైతే వాటిని మనలాంటి సామాన్యుల దాకా అందించిన మహనీయులు కూడా మనకు ఆరాధ్యులే.

వారు ఎన్నో రహస్యాలను సూత్రబద్దం చేసి మనం కూడా చదివే అధికారాన్ని ఇచ్చారు. కొంత కాలం మూందు గ్రంథాలను ముట్టుకోవడమే దోషంగా ఉండే స్థితి నుండి మనం వాటిని అనుసంధానం చేసే స్థితి వరకు తీసుకు వచ్చారు.

మన లాంటి సామాన్యులు తెలియక ఒక పాము నోట్లో పడ్డాం. ఎట్లాంటి పాము అది అంటే.. అది కనిపించక మనల్ని మింగేస్తుంది. మన జన్మలని ఘోరంగా హింసించే సర్పం ఒకటి ఉంది, ఆ సర్పానికి పేరు సంసారం అని.
సంసారం అంటే కుటుంబం అని అనుకుంటాం, కానీ అది కాదు అర్థం. మన చుట్టూ ఉండే వాటి యందు ఉండే పట్టును సంసారం అని అంటారు.

మనలో ఉండే అహంకారమే దీనికి కారణం. అహంకారం అంటే మనది కాని దాన్ని మనది అనిపించే తెలివి తక్కువతనం. శరీరమే నేను అనిపిస్తుంది,
కానీ శరీరం లోన ఉన్న ఆత్మను గుర్తించకపోవడమే అహంకారం లేక సంసారం అని అంటారు. కొన్ని యజ్ఞాలలో యజ్ఞం పూర్తి అయ్యాక పూర్ణాహుతితో పాటు యజ్ఞశాలనే ఆహుతిచేస్తారు.
అట్లా శరీరం అనే వ్యవస్థ భగవంతుడు ఏర్పరిచిన యజ్ఞం. అట్లా అత్మలేని శరీరాన్నీ మనం అట్టే పెట్టుకోం. మనం ఈ శరీరాన్నే సర్వం అని దానిపైనే మమత.

🙏సమస్త లోకా సుఖినోభవన్తు🙏

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి