ఈ శరీరం ఎప్పుడూ ఇలాగే ఉండేది కాదు, ఇప్పుడు అందంగా, బిగువుగా, ఆకర్షణీయంగా ఉన్న శరీరం కొంతకాలం గడిచేసరికి సడలిపోతుంది, కృశించిపోతుంది, అందవిహీనమౌతుంది, చివరకి రాలిపోతుంది…
ఈ విషయాన్ని మనం మరువరాదు, ఈ శరీరం నేను కాదు, ఇది కేవలం నేను వాడుకొనే పరికరం మాత్రమే అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
నా వాచీని నేను ఎలా జాగ్రత్తగా వాడుకుంటున్నానో, దానిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నానో, అది చెడిపోతే ఎలా రిపేరు చేయించుకుంటున్నానో, కొత్త పార్టులు అమర్చుకుంటున్నానో, అలాగే ఈ శరీరాన్ని కూడా అలానే వాడుకోవాలని భావించాలి…
దుస్తులు వేయాలి, పోషించాలి, అందంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి, అవసరమైతే చెడిపోయిన అవయవాలను తొలగించి కొత్త అవయవాలను వేయాలి…
అయితే ఒక ముఖ్య విషయాన్ని మాత్రం మరచిపోకూడదు.
ఇది మన కోసం వాడుకోవాల్సిన పరికరమని, ఒక ముఖ్యమైన పని కొరకు వినియోగించవలసిన సాధనమని, ఇది శాశ్వతంగా ఉండేది కాదని, కనుక తెలివిగా, జాగ్రత్తగా వినియోగించు కోవాల్సినదని జ్ఞాపకం ఉంచుకోవాలి…
సత్యశోధనకై పరమాత్మ ప్రాప్తికై దీనిని వినియోగించాలి…
అంతే గాని శరీరాన్ని పోషించటమే మానవ జీవితం యొక్క పవిత్ర కర్తవ్యం కాదు,
ఏదైనా ఒక వస్తువును పనికి వచ్చినంత కాలం వాడుకుంటాం, పనికి రాకపోతే పారవేస్తాం…
అలా పనికిరాక పారవేసే చిత్తు కాగితాలను గాని, ప్లాస్టిక్ వస్తువులను గాని, ఇనుప ముక్కలను గాని, బల్బులను గాని ఎవరో ఒకరు కొంటారు.
అలాగే ఏ జంతువన్నా చనిపోతే వాటి మాంసాన్నో, వాటి చర్మాన్నో, దంతాలనో ఉపయోగించుకుంటాం.
కాని మనిషి శరీరం మాత్రం ఎవరూ కొనరు. ఎదురు డబ్బు ఇచ్చినా తీసుకోరు…
ఇలాంటి పనికిరాని మురికి మూట అయిన ఈ శరీరం కోసం బ్రతికినన్నాళ్ళు తపించి పోవటం, ఇతరుల నెత్తిన చెయ్యి పెట్టటం, గొంతులు కొయ్యటం, యుద్ధాలు చెయ్యటం, దారుణంగా హత్యలు చెయ్యటం జరుగుతుంటాయి.
ప్రాణం పోయిన తర్వాత దీనికి పైసా విలువలేదు, ఇంటిలో ఎవరూ దీని క్షేమాన్ని గురించి పట్టించుకోరు, తుదకు భార్య కూడా భయపడుతుంది, ఈ కట్టెను మండే కట్టెల మీదకు చేర్చి అడ్డం వదలించుకుంటారు,
మరి ఇట్టి శరీరాన్ని చూసుకొని, దీని కోసం విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం, మానవ జీవిత పరమార్థాన్ని సాధించటానికి వినియోగించకపోవటం తెలివైనపనేనా…
కనుక ప్రాణం పోతే ఎందుకూ పనికిరాని ఈ శరీరాన్ని ప్రాణం ఉన్నంత కాలం ఎలా ఉపయోగించుకోవాలో, ఏమి సాధించుకోవాలో అనే విషయాన్ని నిరంతరం విచారణ చేసుకోవాలి, శరీరాభిమానం తగ్గించుకోవాలి, నిజంగా శరీరాభిమానమే మనకు ఒక బంధం అని గ్రహించాలి.
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
వ్యాఖ్యానించండి