ఇది అద్వైత సిద్ధాంతంలో ప్రత్యేకంగా చర్చించబడిన విషయం…
‘అత్రబ్రహ్మ సమశ్నుతే’ మున్నగు శృతులలో జీవన్ముక్తి పేర్కొనబడింది.
ఈ దేహం తోనే ముక్తిని సాధించటం జీవన్ముక్తి, శ్రావణ, మనన, నిధి ధ్యాసనల ద్వారా మనోవాసనలను క్షయమొనర్చుట ద్వారా జీవన్ముక్తి సాధ్యమవుతుంది.
జీవన్ముక్తి స్థితి ఏవిధంగా ఉంటుందో..
శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులు ఈ విషయాన్ని చక్కగా వివరించారు..
సవితర్యపి శీతరుచౌ చంద్రే తీక్ష్ణేప్యధో వహత్యఙనౌ |
మాయుకమిదమితి జానన్ జీవన్ముక్తోన విస్మయీ భవతి ||
సూర్యుడు చల్లగా భాసించినా, చంద్రుడు చాలా వేడిగా అనిపించినా, జ్వాలలు తలక్రిందులుగా మండుతున్నా జీవన్ముక్తుడు ఆశ్చర్యపోడు. అలాగే జనకుడు కూడా అన్నాడు..
“మిధిలాయాం ప్రదీప్తాయాం నమే కించిత్ ప్రదహ్యతే” మిథిలానగరం తగలబడుతున్నా నాకేమీ కాదు అని దీని తాత్పర్యం, అంటే ఏమిటంటే బ్రహ్మాత్మైక్యానుభవం గల జీవన్ముక్తుడు దేని వలననూ ప్రభావితుడు కాడు అని అర్ధం.
శ్రీ కృష్ణ భగవానుడు జీవన్ముక్తుని లక్షణాలను ‘అద్వేష్టా సర్వభూతానాం’ తో ప్రారంభించి..
‘తుల్య నిన్దాస్తుతి ర్మౌని సస్తుష్టో యేన కేనచిత్ | అనికేతః స్ధిరమతిః భక్తిమాన్మే ప్రియో నరః ||’
జీవన్ముక్తుడు ఏ ప్రాణిని ద్వేషించడు. స్తుతి, నిందలు రెండు ఒక విధంగానే స్వీకరిస్తాడు. మౌనంగా ఉంటూ ఎల్లప్పుడూ సంతుష్టుడై, స్థిరమైన నివాసమనేది ఏమిలేకుండ, స్థిరచిత్తంతో భక్తి భావనలో ఉంటాడు.
శుకుడు, వామదేవుడు మొదలగువారు ప్రఖ్యాతి చెందిన జీవన్ముక్తులు.
ఈ మధ్యకాలంలో శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులు, జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి వారు, భగవాన్ రమణ మహర్షి మొదలైన వారు జీవన్ముక్తులకు ఉదాహరణలు.
వారి పేర్లను స్మరించుట వలననే మంచి జరుగుతుంది. జన్మనెత్తిన ప్రతి యొక్కరికీ, ముక్తిని పొందటమే లక్ష్యం, జ్ఞానాన్ని పొందినప్పుడే ఆ స్థితి లభిస్తుంది.
🙏సమస్త లోకా సుఖినోభవన్తు!🙏
వ్యాఖ్యానించండి