ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

మనం నిజజీవితంలో అనుభవించే అనుభూతి ఏమిటి? ఉపనిషత్తులు ఏమి తెలుపుతున్నాయి?

ఆనందం అనేది మానవుని సహజస్థితి, వాస్తవస్థితి…
కానీ, నేడు అనేక మందిమి తమ సహజస్థితి తెలుసుకోలేక ప్రాపంచిక సుఖసంతోషాలే ఆనందమన్న భ్రాంతిలో మనుగడ సాగిస్తున్నాము…
సుఖం, సంతోషం, ఆనందం.. ఒకేలా చెప్పేస్తున్నా, అవి వేరు… ఇవి మూడు రకాల అనుభూతులు…

1) పంచేంద్రియాలను సంతృప్తి పరిచే ‘సుఖానుభూతి’ శారీరకమైనది.

2) వినోద భరితమై మనస్సును ఉత్సాహ పరిచే ‘సంతోషానుభూతి’ మానసికం.

3) వీటికి అతీతమైంది “ఆనందానుభూతి” ఆత్మ సంబంధితం.

ఆనందం, ఆధ్యాత్మికం, బాహ్య ప్రపంచముతో సంబంధంలేని అంతర్గత అనుభూతినే ఆనందం అంటారు…

సుఖానుభూతి కట్టిపడేస్తుంది, సంతోషానుభూతి చిరుస్వేచ్చనిస్తుంది, ఆనందం పరిపూర్ణమైన స్వాతంత్ర్యం అందజేస్తుంది…
శారీరకస్థాయిని, మానసికస్థాయిని దాటి హృదయస్థాయికి వచ్చినప్పుడే ఆనందం అనుభవమై ఆత్మస్థాయికి వస్తాము

మొదటిది బంధం,
రెండవది తాత్కాలితం,
మూడవది శాశ్వతం…

మొదటి రెండిటిని పట్టుకున్నవాడు జనన మరణాల చక్రంలో పరిభ్రమిస్తునే ఉంటాడు,
కానీ పరమానందస్థితికి వచ్చిన వాడు అమృతమయుడే అని అంటాడు, తనే బుద్ధుడు…
ఆనందముగా జీవించడానికి హంగులు అవసరం లేదు, ఆర్ధిక స్థితి గతులు అవసరం లేదు, అవగాహనతో మనమున్నస్థితిని అంగీకరించడం, ఏ పరిస్థితులోనైన సమస్థితిలో వుండగలగడం.
అన్నీ.. అందరూ.. పరమాత్ముని అనుగ్రహమేనన్న భావనతో వుండగలగడం అలవర్చుకోవాలి.

మన భావాల పట్ల, మనలో ఉన్న ఆంతర్యామి పట్ల, మనకు అమరిన లేదా అమర్చుకున్నవాటి పట్ల, మన చుట్టూ ఉన్నవారందరిలో వున్న ఆంతర్యామిపట్ల ఎరుకతో వుండడం నేర్చుకోవాలి.

ఇది అలవరుచుకొన్న వారు అనుక్షణం ప్రార్ధనలో వున్నట్లే, ఆనందంగా వున్నట్లే, ఆంతర్యామితో వున్నట్లే…

ఆనందాన్ని మానుషం, దివ్యం అంటూ రెండు రకములు… (తైత్తిరీయోపనిషత్.. ఆనందవల్లి.. )
మొదటి కొస మానుషమైతే రెండవ కొస దివ్యం.
మొదటి కొస నుండి రెండవ కొసకు చేసే పయనమే ఆధ్యాత్మిక ప్రయాణం.

మొదటి కొస నుండి రెండవ కొసకు చేరడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన.
వ్యక్తిచేతన నుండి దివ్యచేతన వైపు సాగిపోవడమే మానవజన్మకు సార్ధకత.
మానుషమైన ఆనందం నుండి దివ్యమైన ఆనందం లోనికి చేరుకోవడమే పరమార్ధకత.

ఆనందం, దివ్యానందం, పరమానందం, సచ్చిదానందం, ఆత్మానందం… పేరు ఏదైతేనేం.. అన్నీ ఆ ఏకైక దైవికమైన సత్యస్థితిని తెలియజెప్పేవే…

ఎక్కడ అహం (నేను) వుండదో అక్కడే ఆనందం వుంటుంది.
మనలోపలే వున్న ఆనందాన్ని అందుకోవడానికి అంతర్ముఖులం కావాలి, అప్పుడే అర్ధమౌతుంది ఆనందమే చైతన్యమని…
ఆ అన్వేషణలోనే తెలుస్తుంది ‘సత్ చిత్ ఆనందం’…

సత్ అంటే సత్యం,
చిత్ అంటే చైతన్యం,
ఆనందమంటే పరమానందం..

ముందుగా సత్యమును తెలుసుకుంటాం, తర్వాత ఇంకా లోతుల్లోనికి పయనిస్తే చైతన్యమును తెలుసుకోగల్గుతాం, అటుపిమ్మట అనుభవమైనదే “ఆనందస్థితి”.
ఇలా ఆనందమును తెలుసుకున్నవారు (ఆనందం బ్రహ్మనో విద్వాన్) ఆత్మను స్పృశించగలరు (నయఏవం విద్వానే తే ఆత్మానం స్పృణతే)…
ఆనందమునకు సోపానములు ఫలాపేక్ష లేకుండా పనిచేయడం.
అందరిలో అంతర్యామిని గుర్తించడం,
ఏ క్షణంకాక్షణం వర్తమానంలో జీవించడం. భూతదయ, సేవాదృక్పధం కలిగివుండడం.

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి